మనోజ్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: మంచు నిర్మల లెటర్​

మనోజ్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: మంచు నిర్మల లెటర్​

బడంగ్ పేట్/జూబ్లీహిల్స్, వెలుగు: తన పెద్ద కొడుకు మంచు విష్ణు ఏ తప్పు చేయలేదని, అతనిపై మంచు మనోజ్​చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మోహన్​బాబు భార్య, మనోజ్ తల్లి నిర్మల తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం పహడీషరీఫ్​పోలీసులకు లెటర్​ రాశారు. కొద్ది రోజుల కింద జనరేటర్‎లో విష్ణు చక్కెర పోసి కరెంట్​ఆపేశాడని, తమను చంపాలని చూశాడని మనోజ్​చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని వెల్లడించారు. ఆ కాపీలను రాచకొండ కమిషనర్, మహేశ్వరం డీసీపీ, ఏసీపీలకు పంపించారు. 

లెటర్‎లోని వివరాల ప్రకారం.. డిసెంబర్​14న తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద కొడుకు విష్ణు జల్​పల్లిలోని ఇంటికి కేక్​ తీసుకువచ్చి తనతో కట్​చేయించాడని నిర్మల చెప్పారు. తర్వాత అక్కడున్న అతడి సామన్లు తీసుకొని వెళ్లిపోయాడని వివరించారు. దీన్ని మనోజ్​తప్పుగా ప్రచారం చేశాడన్నారు. జనరేటర్‎లో చక్కెర పోసినట్టు.. ఏదో సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టి.. లేనిపోని అభాండాలు వేసి పోలీస్ ​కంప్లయింట్ ఇచ్చాడని మండిపడ్డారు. ఇంట్లో పని చేసేవాళ్లు వర్క్ మానెయ్యడానికి విష్ణు ప్రమేయం ఏమీ లేదన్నారు. జల్​పల్లిలోని ఇంట్లో మనోజ్‎కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందన్నారు.  

మోహన్​బాబు పిస్టల్​డిపాజిట్​

ప్రముఖ నటుడు మోహన్​బాబు తన లైసెన్సుడ్​రివాల్వర్​ను మంగళవారం ఫిల్మ్​నగర్​ పోలీసు స్టేషన్​లో డిపాజిట్​చేశారు. ఇటీవల కుటుంబ సభ్యల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసులు గన్​ను స్వాధీనం చేయాలని ఆయనకు నోటీసులిచ్చారు. దీంతో మోహన్​బాబు ఒక గన్​ను ఏపీలోని చంద్రగిరి పోలీసులకు స్వాధీనం చేశారు. పిస్టల్​ను ఆయన కజిన్​గజేంద్ర నాయుడు ద్వారా  మంగళవారం ఫిల్మ్​నగర్​పోలీసులకు అప్పగించాడు.