- ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న సీఎం
- భారీగా చేరికలకు ఏర్పాట్లు
నారాయణపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జన జాతర సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరగనున్న ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు పాలమూరు పార్లమెంట్ పరిధిలోని పార్టీ నేతలు, అభిమానులతో పాటు ప్రజలను భారీగా తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండడంతో ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
మహబూబ్‌నగర్ ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ముందస్తుగా పార్టీ క్యాండిడేట్‌గా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించారు. నారాయణపేటకు జీవో 69 ద్వారా పేట, కొడంగల్ ఎత్తిపోతలతో సాగునీటిని అందించేందుకు అడ్మినిస్ట్రేటీవ్ శాంక్షన్ ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా ప్రజలు భారీగా తరలివచ్చి సభను సక్సెస్ చేయాలని మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు ప్రజలను కోరుతున్నారు.
5 గంటలకు సభ..
సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు మినీ స్టేడియంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.45కు హెలికాప్టర్ ద్వారా నారాయణపేటకు చేరుకొని, అక్కడి నుంచి సభాస్థలికి వెళ్తారు. సభ అనంతరం రోడ్ మార్గంలో హైదరాబాద్ వెళ్తారు. సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్చార్జి శివకుమార్ రెడ్డి పరిశీలించారు. ఎస్పీ యోగేశ్ గౌతమ్ సభాస్థలి, హెలిప్యాడ్ ను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జన సమీకరణపై ఫోకస్..
జన జాతర సభ ద్వారా రాష్ట్రంలో సీఎం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండగా, ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించడంపై పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల నుంచి పార్టీ నేతలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక సభలో భాగంగా నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ కు చెందిన బీఆర్ఎస్, బీజేపీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేర్చుకునేందుకు ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారు.