రాయలసీమలో టెన్షన్ : దలువాయిపల్లిలో కొట్టుకున్న పార్టీలు, ఈవీఎంలు ధ్వంసం

ఏపీ రాష్ట్రం రాయలసీమలో కొన్ని చోట్ల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. అన్నమయ్య జిల్లా రాజంపేట ఏరియాలోని పుల్లంపేట మండలం దలువాయిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఘర్షణ జరిగింది. వైసీసీ, టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ లోనే ఒకరికొకరు గొడవ పడ్డారు. పోలింగ్ బూత్ లో జరిగిన ఘర్షణలో.. ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. 

పార్టీ కార్యకర్తల మధ్య తోపులాటలో పోలింగ్ బూత్ లోని ఫర్నింగ్ సైతం చెల్లాచెదురు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని లాఠీఛార్జి చేశారు. దీంతో అక్కడి నుంచి పారిపోయారు కార్యకర్తలు. ఈవీఎంలు ధ్వంసం కావటంతో.. ఓటింగ్ నిలిచిపోయింది. కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

కొత్త ఈవీఎంల ఏర్పాటు తర్వాత గంట ఆలస్యంగా పోలింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. పోలింగ్ బూత్ లో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్ అయ్యింది. నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.