- స్టేట్ ఫుడ్ లేబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిందన్న ఈవో
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాద తయారీలో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్ఛమైనదేనని స్టేట్ ఫుడ్ లేబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిందని ఈవో భాస్కర్‌రావు చెప్పారు. కొండపైన బుధవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీలో వాడుతున్న నెయ్యిపై ఆరోపణలు రావడంతో యాదగిరిగుట్టతో పాటు అన్ని ప్రధాన ఆలయాల్లో వాడుతున్న నెయ్యి శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపించారు.
ఈ క్రమంలో యాదగిరిగుట్ట లడ్డూ ప్రసాద తయారీలో వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదేని, ఎలాంటి కల్తీ లేదని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగా యాదగిరిగుట్టకు గత 40 ఏండ్లుగా మదర్ డెయిరీనే నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ కాంట్రాక్ట్ గడువు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంది. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఏ డెయిరీ నుంచి నెయ్యిని తీసుకోవాలన్న నిర్ణయం తీసుకుంటామని ఈవో చెప్పారు.
కొండగట్టుకు విజయ డెయిరీ నెయ్యి
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న లడ్డూ ప్రసాదం తయారీకి విజయ డెయిరీ నుంచి బుధవారం 1,995 కిలోల నెయ్యి వచ్చింది. టీటీడీ లడ్డూ తయారీలో వాడిన నెయ్యిపై విమర్శలు రావడంతో ఆలయాలన్నీ విజయ డెయిరీ నుంచే నెయ్యి కొనాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఈ క్రమంలో రూ. 609కి కిలో చొప్పున 1,995 కిలోల నెయ్యిని కొనుగోలు చేసినట్లు ఈవో రామకృష్ణారావు తెలిపారు.