భారతదేశ రాజకీయ పార్టీల పరిణామక్రమాన్ని కొన్ని దశల్లో పరిశీలించవచ్చు. స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలను మొదలుకొని ఇటీవల 2024లో జరిగిన 18వ ఎన్నికల వరకు మన రాజకీయపార్టీల పరిణామక్రమాన్ని పరిశీలించినప్పుడు వివిధ దశల్లో ప్రాధాన్యతను కలిగి ఉన్న పార్టీలతోపాటు ఆయా కాలాల్లో చోటుచేసుకున్న మార్పులను గమనించవచ్చు.
మొదటి దశ (1952–1967)
1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు మొదలుకుని 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల వరకు భారత రాజకీయాలను కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ శాసించిన పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్. దేశ పాలనలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ జవహర్ లాల్ నెహ్రూ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహించారు. బలమైన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడం గమనింపదగిన అంశం. 1962లో నెహ్రూ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నది.
రెండో దశ (1967–1977)
1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం భారత రాజకీయాల్లో ముఖ్యమైన మార్పులు సంభవించాయి. ఎనిమిది ప్రధాన రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తక్కువ మెజార్టీతో అధికారంలో వచ్చింది. లోక్‌సభలో స్వాతంత్ర్య పార్టీ జనసంఘ్ పార్టీలతోపాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గమనించదగిన స్థాయిలో స్థానాలను పొందాయి. 1969లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది. మొరార్జీ దేశాయ్ పార్టీని వీడటంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం లోక్‌సభలో మైనార్టీలో పడింది. డీఎంకే, భారత కమ్యూనిస్టు పార్టీ విధాన ప్రాతిపదికపై ఇందిరాగాంధీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 1970లో ఇందిరాగాంధీ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసి మధ్యంతర ఎన్నికలకు పిలుపు ఇచ్చారు. 1971లో జరిగిన మొదటి మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 351 స్థానాలు సంపాదించడం ద్వారా తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. 1971 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ తిరుగులేని రాజకీయశక్తిగా తన అధికారాన్ని చెలాయించారు. 1975లో జాతీయ ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించడంతోపాటు 1976లో మినీ రాజ్యాంగంగా పేర్కొనే 42వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టారు.
మూడో దశ (1977–90)
1977లో జరిగిన ఆరో సాధారణ ఎన్నికల్లో మొదటిసారిగా కేంద్రంలో కాంగ్రెసేయేతర పార్టీయైన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించింది. 1975లో విధించిన ఆంతరంగిక అత్యవసర పరిస్థితి కాలంలో ప్రతిపక్ష పార్టీల నాయకులందరిని నిర్బంధించిన పరిస్థితుల్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రోద్బలంతో భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, సంయుక్త విధాయకదళ్, సంస్థాగత కాంగ్రెస్ పార్టీల కలయిక ద్వారా జనతా పార్టీ ఏర్పడి 298 స్థానాలతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ కనీసం పార్లమెంట్ సభ్యురాలిగా కూడా గెలవలేదు. 1979లో జనతా పార్టీలో సంభవించిన చీలిక కారణంగా మొరార్జీ దేశాయ్ తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడం, జనతా పార్టీ నుంచి చీలిపోయిన చరణ్‌సింగ్ ప్రధాన మంత్రి పదవి చేపట్టినా 23 రోజులకే లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోలేక రాజీనామా చేశారు. 1980లో జనతా పార్టీలో మరో చీలిక సంభవించి భారతీయ జనతా పార్టీ ఏర్పడింది.
నాలుగో దశ (1980–1989)
1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి 352 స్థానాలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీలు గుర్తించదగిన స్థానాలు కూడా గెలుపొందలేకపోయాయి. 1984, అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఇందిర మరణంతో రాజీవ్‌గాంధీ భారతదేశ పరిపాలన పగ్గాలను చేపట్టి 1984, డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ 414 స్థానాలను సంపాదించింది. బీజేపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుపొందింది. వాజ్‌పేయి, అద్వానీ వంటి ఉద్దండులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రాంతీయపార్టీ అయిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది.
ఐదో దశ (1989–2014)
1989లో జరిగిన 9వ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడంతో మొదటిసారిగా పార్లమెంటరీ చరిత్రలో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. ప్రతిపక్షాలతో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ మొదటిసారిగా ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టింది. పార్లమెంట్లో బలమైన పార్టీగా ఏర్పడిన బీజేపీ, వామపక్షాల మద్దతుతో వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, అయోధ్య వివాదంలో బీజేపీ మద్దతు ఉపసంహరణతో వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం పతనమైంది. రాజీవ్ గాంధీ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్ ప్రభుత్వం ఆరు నెలలకే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో ఆ ప్రభుత్వం కూడా పడిపోయి మరోసారి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. అలాగే, ఏ రాజకీయ పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ సాధించనప్పటికీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ నుంచి పి.వి.నర్సింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పూర్తి పదవీకాలం కొనసాగారు. 1996లో జరిగిన 11వ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోలేని కారణంగా ప్రభుత్వం 13 రోజులకే రాజీనామా చేసింది. జనతాదళ్‌కు చెందిన దేవెగౌడ నేతృత్వంలో 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన థర్డ్ ఫ్రంట్‌కు చెందిన ప్రభుత్వంలో టీడీపీ, డీఎంకే, అకాలీదళ్, నేషనల్ కాన్ఫరెన్స్ భాగస్వాములయ్యాయి. ఏడాది తర్వాత దేవెగౌడ స్థానంలో ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. 1998లో కాంగ్రెస్ తన మద్దతును పూర్తిగా ఉపసంహరించుకోవడంతో జనతాదళ్ ప్రభుత్వం కూడా పతనమైంది.
1998 మధ్యంతర ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించలేక 24 పార్టీల మద్దతుతో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1999లో ఏఐఏడీఎంకేకు చెందిన జయలలిత వాజ్‌పేయి ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించడంతో 13 నెలలకే వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానం ద్వారా తన అధికారాన్ని కోల్పోయింది. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నిల్లో ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజార్టీ సంపాదించింది. 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏను ఏర్పాటు చేసుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2009లో జరిగిన 15వ సాధారణ ఎన్నికల నాటికి వామపక్ష పార్టీలు యూపీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ యూపీఏ కూటమి 13 పార్టీలతో రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఆరో దశ (2014 తర్వాత)
2014లో జరిగిన 16వ సాధారణ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని ముందుగానే ప్రకటించడంతోపాటు ఎన్డీఏ తన పాత మిత్రులను ముఖ్యంగా టీడీపీని చేర్చుకున్నది. అకాలీదళ్, శివసేనలు అదే కూటమిలో కొనసాగాయి. ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించింది. బీజేపీ తన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా 282 స్థానాలను సంపాదించగా దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాలు అంటే కేవలం 44 స్థానాలను మాత్రమే గెలుపొందింది. 2019లో లోక్‌సభకు జరిగిన 17వ సాధారణ ఎన్నికలు మన దేశ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చివేశాయి. పూర్తికాలం అంటే ఐదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉండి వెంటనే జరిగిన ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీని సాధించి అధికారంలోకి వచ్చిన మొదటి ప్రధాన నెహ్రూ, రెండో ప్రధాని నరేంద్ర మోదీ, బలమైన నాయకత్వంతో పటిష్టమైన యంత్రాంగంతో సమిష్టి వ్యూహాన్ని అనుసరించడం వల్ల బీజేపీ 303 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కానీ, 2024లో లోక్‌సభకు జరిగిన 18వ సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ స్థానాలు సాధించలేకపోయింది. 240 స్థానాలు మాత్రమే సాధించడంతో దేశంలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వాలకు తెరలేచింది. టీడీపీ, జేడీయూ మద్దతుతో నరేంద్రమోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.