పేదల కోటకు కొర్రీలు

సామాజికంగా గౌరవం లభిస్తున్నా… ఆర్థికంగా బలహీనమైన వర్గాలకోసం కల్పించినదే ‘ఈడబ్ల్యుఎస్​ 10 శాతం కోటా’. జనరల్​ ఎలక్షన్స్​కి ముందు ఈ చట్టాన్ని తెచ్చారు. 10 శాతం కోటా పొందాలంటే చాలా ధ్రువీకరణ పత్రాలు అవసరం. వాటిని ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు అందలేదు. ఈడబ్ల్యుఎస్​ స్టూడెంట్లు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటి వరకు రిజర్వేషన్లు పొందుతున్నవారికి నష్టం కలగకుండా సీట్లు పెంచాలి. టీచర్లు, క్లాస్​ రూమ్​లు, ఇతర సదుపాయాలు పెరగాలి.  దీంతో కోటా అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్ద కులాల్లోని పేదలను ఆదుకోవడానికి పది శాతం రిజర్వేషన్ల చట్టానికి ఇది మొదటి అకడమిక్​ ఇయర్​. ఇటీవలి వరకు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఆయా కేటగిరీల్లోకి రానివారిని, ఆదాయం ప్రాతిపదికన ‘ఎకనమికల్లీ బ్యాక్​వర్డ్​ సెక్షన్​ (ఈడబ్ల్యుఎస్​)’ కేటగిరీ కిందకు తెచ్చి… అలాంటివారికి ఉన్నత విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు  కల్పిస్తూ చట్టం చేసింది. దీనిని నరేంద్ర మోడీ ప్రభుత్వం జనరల్​ ఎలక్షన్స్​కి ముందు పార్లమెంట్​లో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించారు. ఈడబ్ల్యుఎస్​ కోటా తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమల్లోకి రాబోతోంది. ఈ కోటా అమలు ముందుకు సాగడం లేదు. దీనికి చాలా కారణాలున్నాయి.

ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అర్హులకు ఏడాది ఆదాయం ఎనిమిది లక్షలకు తక్కువ ఉండాలి. వారు మాత్రమే రిజర్వేషన్లకు అర్హులవుతారు. దీనికోసం ఆదాయం సర్టిఫికెట్​తో పాటు ఇతర సర్టిఫికెట్లు కూడా స్టూడెంట్లు సమర్పించాలి. చట్టమైతే చేశారు కానీ,ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు సంబంధించి యూనివర్శిటీలకు స్పష్టమైన గైడ్ లైన్స్ అందలేదు. ఆదాయంసహా అన్ని సర్టిఫికెట్లను వారి వారి సొంతూళ్లలో రెవెన్యూ అధికారులద్వారా తీసుకోవాలి. యూనివర్శిటీ అడ్మిషన్లకోసం అవసరమైన సర్టిఫికెట్స్ అడుగుతుంటే… దీనిపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారు సంబంధిత అధికారులు. దేశంలో అనేక యూనివర్శిటీల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ అధికారులు స్టూడెంట్లకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లకు కొర్రీలు పెడుతున్నారు. నార్త్ ఢిల్లీలో నివసించే  రోహిణి అనే స్టూడెంట్ ఏకంగా ఢిల్లీ సర్కార్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రింట్ అవుట్​ని తీసుకెళ్లి అధికారులకు చూపించంది. అయినాసరే, సర్టిఫికెట్లు ఇవ్వడానికి అధికారులు వెనకాముందు ఆడుతున్నారు.

బ్యాంక్ స్టేట్​మెంట్లు, ఇన్​కం ట్యాక్స్ రిటర్న్స్​

ఇన్​కం సర్టిఫికెట్ ఇవ్వాలంటే వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకు తక్కువగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. దీనికి ఆధారాలను ముందుగా ప్రభుత్వ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భూమి కూడా ఐదెకరాల లోపు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకొచ్చి వాటిని పై అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు వాటిని పరిశీలించి  ఓకే అనుకున్నాకే స్టూడెంట్లకు అవసరమైన సర్టిఫికెట్లు ఇస్తారు. ఇవన్నీ ఒక పట్టాన తేలే వ్యవహారం కాదు. కుటుంబ పెద్ద (తండ్రి) ఆరునెలల బ్యాంక్ స్టేట్​మెంట్ కోసం  బ్యాంకుల చుట్టూ స్టూడెంట్లు చక్కర్లు కొడుతున్నా బ్యాంకు అధికారులు కూడా మీనమేషాలు లెక్కపెడుతున్నారు.  ‘అది లేదు…ఇది లేదు ’ అంటూ బ్యాంక్​ ఆఫీసర్లు కొర్రీలు పెడుతున్నారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. వీటిని మించిన మరో పెద్ద బెడద ఉంది.  కుటుంబ ఆదాయానికి సంబంధించి మూడేళ్ల పాటు ఇన్ కం టాక్స్ (ఐటీ) రిటర్న్స్ కూడా చూపించాలంటూ మెలిక పెడుతున్నారు. ఈ సర్టిఫికెట్లు అన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే…  కోటా కింద అడ్మిషన్లకు అవసరమైన సర్టిఫికెట్లు ఇస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారని స్టూడెంట్లు వాపోతున్నారు.

అతి పెద్ద సమస్య సీట్ల పెంపుదల

ఈడబ్ల్యుఎస్ కోటా అమలు చేయడానికి వీలుగా అన్ని యూనివర్శిటీలు సీట్ల సంఖ్యను 25 శాతం పెంచుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ హెచ్​ఆర్​డీ మినిస్ట్రీ జనవరిలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.  ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్లకు దక్కుతున్న రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలగకుండా సీట్ల సంఖ్యను పెంచుతూ ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఈ ఏడాది 10 శాతం సీట్లను పెంచాలని,  వచ్చే ఏడాది మిగతా 15 శాతం సీట్లను పెంచాలన్నది ఢిల్లీ వర్శిటీ ప్లాన్. సీట్లు పెంచడం అంటే యూనివర్శిటీకి అనుబంధంగా ఉండే కాలేజీల్లోనూ సీట్లు పెంచాల్సి ఉంటుంది. అయితే ఇదంత ఆషామాషీ వ్యవహారం కాదు.  స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టు వసతులు కూడా పెరగాల్సి ఉంటుంది. కొత్త గా క్లాస్ రూంలు ఏర్పాటు చేయాలి. ఇదొక పెద్ద ప్రాసెస్. పెరిగే సీట్లకు తగ్గట్టు బిల్డింగుల నిర్మాణం రాత్రికి రాత్రి జరగదంటున్నారు కాలేజీల నిర్వాహకులు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఒక్కటే కాదు ఫ్యాకల్టీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అనేక కాలేజీల్లో ఇప్పటికే తగినంత మంది టీచర్లు లేరు. సీట్ల సంఖ్యకు తగ్గట్టు టీచర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది.