హైదరాబాద్ పరిధిలోని మీర్‌పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడకపెట్టాడు. చివరగా ఆ మాంసం ముద్దలను ఎండబెట్టి.. పొడిగా మార్చి నగర శివారులోని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా, జేపీ చెరువుకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి ప్రస్తుతం డీఆర్డీవో(DRDO)లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈయన భార్య వెంకట మాధవి(35), ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లెల్లగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఆమెను హంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ రావడంతో.. పిల్లలను ఊరికి పంపించి పక్కా ప్లాన్ ప్రకారం భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి శరీర భాగాలన్నింటిని నాలుగైదు దపాలుగా కుక్కర్‌లో ఉడకపెట్టాడు. అంతటిలో ఆగకుండా ఆ మానవ మాంసాన్ని.. ఇంట్లోనే ఎండబెట్టి పొడిగా మార్చాడు. చివరగా ఆ పొడిని తీసుకుపోయి నగర శివారులోని జిల్లెలగూడ చెరువులో పడేశాడు.
వెంకట మాధవి నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ లేకపోవడంతో.. అనుమానమొచ్చిన తల్లిదండ్రులు ఈనెల 13న కుమార్తె కనిపించడం లేదని మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో గురుమూర్తి వారి వెంటే ఉన్నారు. తనకు ఏం తెలియదు అన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్‌పేట్ పీఎస్‌కు వచ్చాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్థానికులను విచారించగా.. భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు జరుగుతున్న విషయం బయటకు వచ్చింది. అనుమానంతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ట్రయల్ కోసం ఒక కుక్కను చంపి ముక్కలుగా నరికిన ఉడకబెట్టడాని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వెంకట మాధవి శరీర పొడిని సేకరించే పనిలో పడ్డారు. పొడి చెరువు నీటిలో కలిసిపోయి ఉంటుంది కనుక సేకరించడం కాస్త కష్టమే.