వరంగల్‍ లో ఖాళీ అవుతున్న కారు

  • వరంగల్‍ బీఆర్ఎస్​లో కుదుపు
  •  బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ !
  •  హైదరాబాద్‍లో అమిత్‍షాను కలిసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
  • నేడు ఢిల్లీలో అధికారికంగా చేరిక
  • వరంగల్​ ఎంపీ టికెట్​పై హామీ!

వరంగల్‍, వెలుగు:ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో బీఆర్‍ఎస్‍ పార్టీలో భారీ కుదుపు. ఆ పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ కారు దిగారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‍ షాను హైదరాబాద్‍లో కలిసిన ఆయన బుధవారం ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ నుంచి వరంగల్‍ ఎంపీ క్యాండిడేట్​గా ఆరూరి రమేశ్​కు టికెట్ పై హామీ లభించినట్లు ప్రచారం జరగుతున్నది.

కేసీఆర్‍, కేటీఆర్‍ చెప్పినా.. వినలే

2014, 2018 ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యే గా గెలిచిన ఆరూరి రమేశ్‍ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ అభ్యర్థి కేఆర్‍ నాగరాజు చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి వరంగల్​ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన ఎస్సీ నేతగా రమేశ్​కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్​ వరంగల్​ జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఓటమి తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడుతుండటంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరితే  వరంగల్​ ఎంపీ టికెట్​కు అభ్యర్థిగా పరిశీలిస్తామని ఆయనకు ఆఫర్ వచ్చింది. దీంతో ఆ పార్టీలో చేరేందుకు రమేశ్​ రెడీ అయిన సంగతి తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ రంగంలోకి దిగి బుజ్జగించారు. దీంతో ఇటీవల రమేశ్‍ ప్రెస్‍మీట్‍ పెట్టి తాను బీఆర్‍ఎస్‍ ను వీడట్లేదని చెప్పారు. అయితే 3 రోజులకే బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఖాళీ అవుతున్న కారు

వరంగల్‍, హనుమకొండ జిల్లాలతో పాటు గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలోకి వచ్చే వర్ధన్నపేట నియోజకవర్గం మొన్నటివరకు గులాబీ పార్టీకి పెట్టని కోటలా ఉండేది. ప్రస్తుతం రోజుకో లీడర్‍ కారు పార్టీకి గుడ్‍బై చెబుతున్నారు. ఇప్పటికే సిటీ పరిధిలో మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు వర్ధన్నపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అంగోతు అరుణతో పాటు కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీలు సైతం బీఆర్‍ఎస్‍ను వీడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అనుచరుడు మార్నేని రవీందర్‍రావు, ఆయన భార్య ఐనవోలు ఎంపీపీ మధుమతి శుక్రవారం కాంగ్రెస్‍లో చేరారు. ఇప్పుడు ఆరూరి రమేశ్‍ పార్టీని వీడాడు. ఇన్నిరోజులు పార్టీ తరఫున వరంగల్‍ ఎంపీ క్యాండిడేట్‍గా రమేశ్‍ను నిలపాలనే ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పుడు మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.