- స్వామివారి నివేదనకు వాడే కిలో నెయ్యి ధర రూ. 1,600
- లడ్డూ ప్రసాదానికి వినియోగించే కిలో నెయ్యి రూ. 320 మాత్రమే
- కల్తీ చేయకుండా ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వచ్చింది?
- భక్తుల అనుమానాలు.. నాటి పాలకమండలిపై ఫైర్
- విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు, ఫిష్ఆయిల్తో తయారుచేసిన నెయ్యిని వాడారని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) తన రిపోర్ట్‌లో అనుమానం వ్యక్తం చేయడంతో ఈ వివాదం రాజుకున్నది. ఇటీవల ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత దుమారం రేపాయి. గత వైసీపీ పాలనలో శ్రీవారి అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు.
అలాగే, లడ్డూ ప్రసాదంలో నాసిరకమైన ఇన్‌గ్రీడియెంట్సే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్‌ను వాడారని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ ఈవో శ్యామలారావు కూడా స్పందించారు. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లేదని, ఇందులో భారీగా కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్ట్‌లో తేలిందని ఆయన వెల్లడించారు. దీనిపై కేంద్రం కూడా స్పందించింది.
ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కారును కోరింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఈ ఆరోపణలు విని స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించే భక్తులు నివ్వెరపోతున్నారు. ఈ వ్యవహారంపై దేశ, విదేశాల్లోని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.320కే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు తలెత్తడంతో టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్‌లోని ఫతేపూర్నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవునెయ్యిని దాతల సహకారంతో సేకరించేవారమని, ఇందుకు రూ. లక్ష ఖర్చుపెట్టేదని చెప్పుకొచ్చారు. అంటే కిలో నెయ్యిని దాదాపు 1600కు కొన్నామని ఆయన వెల్లడించారు.
అదే సమయంలో లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిని కిలో రూ. 320 కి కొన్నట్టు రికార్డుల్లో ఉన్నది. దీనిపై భక్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఎలాంటి కల్తీ చేయకుండా కిలో ఆవు నెయ్యి కేవలం రూ. 320కి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నాటి ప్రభుత్వంతోపాటు పాలకమండలిపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ‘‘ఒక కిలో ఆవు నెయ్యి తయారీకి దాదాపు రూ.1700 లీటర్ల పాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
అంటే లీటరకు రూ. 40 వేసుకున్నా.. కిలో ఆవునెయ్యికి దాదాపు రూ. 700 ఖర్చవుతుంది. అలాంటప్పుడు యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లోని సంస్థలు రవాణా ఖర్చులు భరించి మరీ కిలో నెయ్యిని రూ. 320కే సరఫరా చేశాయా?”అని నిలదీశారు. కల్తీ చేయకుండా ఇది సాధ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, గతంలో వాడే నందిని నెయ్యిని కాదని, తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడంపైనా అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సుప్రీం లో పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ, వెలుగు: తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. హిందూ సేవా సమితి సంస్థ అధ్యక్షులు సూర్జిత్ యాదవ్ శనివారం ఈ పిటిషన్ వేశారు. లడ్డూ కల్తీ అంశంపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని అందులో కోరారు.
ఎంక్వైరీ చేయాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తిరుమల లడ్డూ వివాదంపై ఎంక్వైరీ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఇది ప్రజల విశ్వాసాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనెలను వినియోగించడం క్షమించరాని నేరం. దీనికి బాధ్యులైన వారందరినీ గుర్తించి, తగిన శిక్ష విధించాలి” అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీటీడీ కోరితే విజయ డెయిరీ నెయ్యి సప్లై చేస్తం : పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి ఘోష్
హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన నెయ్యి, పాల ఉత్పత్తులను సరఫరా చేయడానికి విజయ డెయిరీ సిద్ధంగా ఉందని పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. శనివారం ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు తెలంగాణ ప్రభుత్వం తరుఫున లేఖ రాశారు. నాణ్యమైన పాలు, నెయ్యి, పాల ఉత్పత్తులను సరఫరా చేయడంలో విజయ డెయిరీకి ఘన చరిత్ర ఉందన్నారు. విజయ డైరీ ఉత్పత్తుల్లో నాణ్యత నిర్ధారణ పూర్తి శాస్త్రీయంగా జరుగుతుందని తెలిపారు. టీటీడీకి నాణ్యమైన నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.