భోపాల్: విచిత్ర పరిస్థితుల్లో ఇండియాలోనే సెటిలైన చైనా సైనికుడొకరు యాభై ఏళ్ల తర్వాత సొంతూరికి వెళ్లాడు. తిరిగొచ్చేందుకు వీసా కోసం అప్లయ్ చేసుకుంటే అధికారులు తిరస్కరించడంతో చైనాలోనే చిక్కుకుపోయాడు. చైనాలోని షాంక్సి ప్రావిన్స్క్సియాన్ యాంగ్గ్రామానికి చెందిన వాంగ్చాంగ్క్వి 1963 లో ఇండియాతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. మిగతా సైనికులతో కలిసి ఇండియాకు వచ్చాడు. ఇండియన్ సైనికులకు ఖైదీగా చిక్కడంతో గూఢచర్యం ఆరోపణలతో చాంగ్‌ను జైలుకు పంపించారు. ఆరేళ్ల తర్వాత 1969 లో బయటికొచ్చిన చాంగ్ మధ్యప్రదేశ్‌లోని టిరోడాలో సెటిలయ్యాడు. ఓ మిల్లులో పనిచేస్తూ 1974లో అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లలకు తండ్రయ్యాడు. ఆ తర్వాత సొంతంగా ఓ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు.
యాభై నాలుగేళ్ల తర్వాత సొంతూరును చూసొద్దామని 2017 ఫిబ్రవరిలో చైనా వెళ్లాడు చాంగ్. మే నెలలో తిరిగొచ్చి, మళ్లీ ఆగస్టులో చైనా వెళ్లాడు. భార్యకు అనారోగ్యమని తెలిసి అక్టోబర్‌లో తిరిగొచ్చాడు. భార్యతో పాటు పెద్ద కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాతి ఏడాది 2018 జనవరిలో మరోసారి చైనా వెళ్లి ఏప్రిల్‌లో తిరిగొచ్చాడు. కొంతకాలం గడిచాక అక్టోబర్‌లో మరోసారి చైనా వెళ్లిన చాంగ్క్వి.. తిరిగి రావడానికి వీసా కోసం అప్లికేషన్పెట్టుకోగా అధికారులు తిరస్కరించారు. ఎలాంటి కారణం చూపకుండానే వీసాను తిరస్కరించడంతో చాంగ్అక్కడే చిక్కుకుపోయాడు. ఇండియాలోని కొడుకు విష్ణు వాంగ్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. వాంగ్కూడా ఇక్కడి అధికారులతో మాట్లాడినా ఉపయోగంలేకుండా పోయింది. తండ్రి రాక కోసం తామంతా ఆతృతగా ఎదురుచూస్తున్నామని, అధికారులు చొరవ తీసుకుని చాంగ్క్వి ని ఇండియాకు తీసుకురావాలని విష్ణు కోరారు.