చంద్రబాబు.. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నా... మాజీ సీఎం జగన్

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు.ఎన్నికల సమయంలో చెలరేగిన ఘర్షణల కారణంగా నమోదైన పలు కేసుల్లో అరెస్టయ్యి రిమాండ్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిశారు జగన్. గురువారం ( జూలై 4, 2024 )నాడు నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లిని ములాఖత్ లో కలిశారు జగన్. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. నాయకుడి స్థానంలో ఉన్న మనం ఇలాంటి దాడులు చేసే సంప్రదాయాన్ని ప్రోత్సహించటం మంచిది కాదని, ఇకనైనా మానుకోవాలని అన్నారు. ఈసారి కోరడం లేదని హెచ్చరిస్తున్నామని అన్నారు. 

రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలన నడుస్తోందని, వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.తమవారిపై ఇదే రకంగా దాడులు కొనసాగితే అంతకు అంత వడ్డీతో కలిపి ఇస్తామని అన్నారు.ఈ ఎన్నికల్లో తమపై వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని, చంద్రబాబు అబద్దపు హామీల వల్లే గెలిచాడని అన్నారు.చంద్రబాబు మోసాలను డైవర్ట్ చేసేందుకే తమపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. పిన్నెల్లి లాంటివారిపై తప్పుడు కేసులు నమోదు చేయటం సరికాదని అన్నారు.