ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కు జగన్ లేఖ..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్  అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు లేఖ రాసారు. అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు జగన్.మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించటం సంప్రదాయాలకు పద్దతులకు విరుద్ధమని అన్నారు.ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే డిసైడ్ ఐనట్లున్నారని అన్నారు.విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు.

ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకాని ఈ నిబంధన పాటించలేదని గుర్తు చేశారు.అధికారకూటమి, స్పీకర్‌ ఇప్పటికే తన పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని,ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదని అన్నారు.

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని అన్నారు జగన్.ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని లేఖ ద్వారా స్పీకర్ ను కోరారు జగన్.