వైఎస్ షర్మిల కాంగ్రెస్‌పార్టీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఆపార్టీ సీనియర్‌నేత, మాజీ ఎంపీ చింతామోహన్. దివంగత ముఖ్యమంత్రుల కుమార్తెలు ఎలాగో షర్మిల కూడా అంతేనని మోహన్ అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు ఎవ్వరూ ఇడుపులపాయ రావడంలేదని తేల్చి చెప్పారు చింతా మోహన్ .
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. దివంగత వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఇడుపులపాయకు వస్తున్నారని, షర్మిల పార్టీ విలీనం దాదాపు ఖరారైందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇడుపులపాయకు కాంగ్రెస్ అగ్రనేతల రాకపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ క్లారిటీ ఇచ్చారు. ఇడుపులపాయకు కాంగ్రెస్ అగ్రనేతలెవరూ రావడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా షర్మిలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇడుపులపాయకు కాంగ్రెస్ అగ్రనేతలు వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. దివంగత వైఎస్సార్‌ను నెత్తిన పెట్టుకుని కాంగ్రెస్ తప్పు చేసిందని, మరోసారి దాన్ని పునరావృతం చేయదలచుకోలేదన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డికి కూడా కుమార్తెలున్నారని, వారు వచ్చి కాంగ్రెస్‌లో చేరవచ్చన్నారు.ఆ మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఎంతో, షర్మిల కూడా కాంగ్రెస్‌కు అంతే సమానమని ఆయన అన్నారు. అంతేకాని షర్మిలకు ఏపీ కాంగ్రెస్ నాయకత్వం అప్పగించమని చింతా మోహన్ అన్నారు.