Monty Panesar: రాజకీయ అరంగ్రేటం చేయనున్న మాజీ స్పిన్నర్

Monty Panesar: రాజకీయ అరంగ్రేటం చేయనున్న మాజీ స్పిన్నర్

ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జార్జ్ గాల్లోవే వర్కర్స్ పార్టీ తరపున పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత జార్జ్‌ గాల్లోవే మంగళవారం ప్రకటించారు. వామపక్ష వైఖరికి పేరుగాంచిన గాల్లోవే, రాబోయే యూకే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేస్తున్న 200 మంది అభ్యర్థులలో పనేసర్ కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ తన క్రికెట్ కెరీర్‌లో 50 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 167 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు గడించాడు.

పనేసర్ పూర్తి పేరు ముధ్సుదేన్ సింగ్ పనేసర్. లండన్‌కు ఉత్తరాన ఉన్న లూటన్‌లో భారత్ (పంజాబ్) నుండి వలస వచ్చిన సిక్కు తల్లిదండ్రులకు అతను జన్మించాడు. మాంటీ.. పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ సౌతాల్ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం 2007 నుండి వివేంద్ర శర్మ ఆధ్వర్యంలో లేబర్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో శర్మ 16,084 మెజారిటీతో విజయం సాధించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం అక్కడ దాదాపు మూడింట ఒక వంతు (30 శాతం) ఆసియన్ జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. 

"దేశంలోని కార్మికుల కోసం గొంతుకగా ఉండాలనుకుంటున్నాను. రాజకీయాల్లో నా ఆకాంక్ష ఏదో ఒకరోజు ప్రధానమంత్రి కావాలన్నది.. ఆ అవకాశం వస్తే బ్రిటన్‌ను సురక్షితమైన, బలమైన దేశంగా మారుస్తాను. ప్రస్తుతానికి నాముందున్న మొదటి పని ఈలింగ్ సౌతాల్ ప్రజలకు సేవ చేయడమే.." అని పనేసర్ ది టెలిగ్రాఫ్‌తో పేర్కొన్నారు.