కేసీఆర్​ చెప్పినట్లే మార్పులు : రిటైర్డ్​ ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు

కేసీఆర్​ చెప్పినట్లే మార్పులు : రిటైర్డ్​ ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు
  • కాళేశ్వరం డీపీఆర్​లపై రిటైర్డ్​ ఈఎన్​సీ వెంకటేశ్వర్లు వెల్లడి.. జ్యుడీషియల్​ కమిషన్​ ముందు అంగీకారం
  • రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ కూడా నాటి సీఎం ఆదేశాల మేరకే 
  • లొకేషన్లలో మార్పులూ గత ప్రభుత్వం చెప్తేనే చేశామని స్పష్టీకరణ
  • రూ. 16వేల కోట్ల ‘ప్రాణహిత’ పనులను ఎందుకు పక్కనబెట్టారన్న కమిషన్​
  • ప్రాణహిత లిఫ్టులతో కేవలం 150 మెగావాట్ల కరెంటే ఖర్చయ్యేది
  • అలాంటిది 11,230 మెగావాట్లు ఖర్చయ్యే  కాళేశ్వరం ఎందుకు?
  • కేవలం 2 లక్షల ఎకరాల కోసం రూ.1.27 లక్షల కోట్ల ప్రాజెక్టేందని నిలదీత

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డీపీఆర్​లను అప్పటి సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకే తయారు చేశామని, ఆయన చెప్పినట్లుగానే మార్పులు చేశామని రామగుండం రిటైర్డ్​ ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు. ‘‘డీపీఆర్​లకు సంబంధించి 2016 జనవరిలో నాటి సీఎం కేసీఆర్​ రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. వ్యాప్కోస్​ తయారు చేసిన డీపీఆర్​లకు తగ్గట్టు మూడు బ్యారేజీల అంచనాలను రూపొందించాలంటూ ఆదేశించారు. ఆయన సూచించినట్లే డీపీఆర్​లో మార్పులు చేర్పులు చేశాం” అని జ్యుడీషియల్​ కమిషన్​ ముందు అంగీకరించారు. రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ కూడా నాటి సీఎం ఆదేశాలకు తగ్గట్టుగానే చేశామని ఒప్పుకున్నారు. 

పనులు జరిగేటప్పుడు కూడా మార్పులు చేర్పులు

కాళేశ్వరం అవకతవకలను విచారణ జరుపుతున్న జస్టిస్​ పీసీ ఘోష్​ జ్యుడీషియల్​ కమిషన్​.. గురువారం రిటైర్డ్​ ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లును మరోసారి విచారించింది. అంతకుముందు గత నెల 28న ఆయన్ను కమిషన్​ విచారించింది. అయితే, పలు విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉండడంతో మరోసారి ఆయనను కమిషన్​ విచారించింది. ఈ క్రమంలోనే మూడు బ్యారేజీల డీపీఆర్​లను ఎవరి ఆదేశాల మేరకు తయారు చేశారని వెంకటేశ్వర్లును కమిషన్​ ప్రశ్నించింది. మాజీ సీఎం ఆదేశాల మేరకే చేశామని సమాధానం చెప్పారు.  

ప్రాజెక్ట్​ డీపీఆర్​ను ఎప్పుడు సమర్పించారు.. మూడు బ్యారేజీలకు విడివిడిగా ఇచ్చారా? మొత్తం కలిపి ఒకటే డీపీఆర్​ సిద్ధం చేశారా? డీపీఆర్​లోని అంశాలను ఎవరు ఆమోదించారు’’ అని కమిషన్​ ప్రశ్నించింది. దానికి వెంకటేశ్వర్లు బదులిస్తూ ..  ‘‘2016 మార్చిలోనే వ్యాప్కోస్​ డీపీఆర్​లను తయారు చేసింది. మూడు బ్యారేజీలు, పంప్​హౌస్​లకు విడివిడిగా డీపీఆర్​లను తయారు చేయడంతో పాటు మొత్తంగా అన్ని కలిపి కాళేశ్వరం ప్రాజెక్టుకు కంబైన్డ్​గా మరో డీపీఆర్​నూ రూపొందించింది. డీపీఆర్​లోని అంశాలకు నాటి ప్రభుత్వాధినేత ఆమోదం తెలిపారు” అని వివరించారు. డీపీఆర్​లో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా అని కమిషన్​ ప్రశ్నించగా.. బ్యారేజీల పనులు జరిగేటప్పుడు డీపీఆర్​లో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. 

లొకేషన్లు ఎందుకు మార్చారు?

బ్యారేజీల లొకేషన్లపైనా వెంకటేశ్వర్లును కమిషన్​ ప్రశ్నించింది. బ్యారేజీల లొకేషన్లను ఎవరు సూచించారని ప్రశ్నించగా.. డీపీఆర్​లో వ్యాప్కోస్​ సంస్థ లొకేషన్లను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. లొకేషన్లను వ్యాప్కోస్​ సంస్థ సూచించేందుకు అధికారం ఉందా? అని ప్రశ్నించగా.. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆ సంస్థే డీపీఆర్​లు ఇస్తుందని, అందుకే ఆ సంస్థ లొకేషన్లను సూచించిందని చెప్పారు. దీనిపై కమిషన్​ సీరియస్​ అయింది. ప్రభుత్వం, కేబినెట్​ ఆమోదం లేకుండా ఓ సంస్థ లొకేషన్లను ఎలా నిర్ణయిస్తుందని కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే, వ్యాప్కోస్​ సంస్థ సిద్ధం చేసిన డీపీఆర్​లను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాక.. లొకేషన్లపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యాప్కోస్​ డీపీఆర్​ల​ను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. బ్యారేజీల లొకేషన్ల మార్పును ఎవరు సూచించారని ప్రశ్నించగా.. నాటి ప్రభుత్వమే సూచించిందన్నారు.

కేవలం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లనే మార్చారని, తొలుత సూచించిన సైట్​లకు ఒక కిలోమీటర్​ దిగువన లొకేషన్లను మార్చారని పేర్కొన్నారు. ఆయా చోట్ల అన్నారం బ్యారేజీ సైట్​లో ఆఫ్కాన్స్​, సుందిళ్ల సైట్​లో నవయుగ సంస్థలే జియోఫిజికల్​, జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేశాయని తెలిపారు. అసలు అన్నారం లొకేషన్​ను ఎందుకు మార్చారని కమిషన్​ ప్రశ్నించగా.. మేడిగడ్డ నుంచి అన్నారం వరకు గ్రావిటీ కెనాల్​ దూరాన్ని తగ్గించేందుకు, అటవీ భూసేకరణను తగ్గించేందుకు మార్చాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు చెప్పారు. 

ప్రాణహిత పక్కనపెట్టి ప్రజాధనాన్ని వృథా చేశారు

కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులు, ఆ ప్రాజెక్టు నిర్వహణకు అవుతున్న ఖర్చులపై జ్యుడీషియల్​ కమిషన్​ ఆరా తీసింది. అసలు తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాలనుకున్న ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కనపెట్టారని కమిషన్​ ప్రశ్నించింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపొందించిన డీపీఆర్​లో కొన్ని మార్పులు చేర్పులతో కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్​ తయారు చేశారని వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు తొలుత 2007 మే 16న రూ.17,875 కోట్లతో నాటి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందా? ఆ తర్వాత 2008 డిసెంబర్​ 17న రూ.38,500 కోట్లకు పెంచుతూ జీవో 238ను జారీ చేసిన మాట నిజమేనా? 2014 వరకు ఆ ప్రాజెక్టుపై రూ.6,156.9 కోట్లు కూడా ఖర్చుపెట్టారు కదా?’’ అని కమిషన్​ ప్రశ్నించింది.

కాళేశ్వరం ద్వారా 195 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలనుకున్న మాట వాస్తవమేనా? తద్వారా 18.25 లక్షల ఎకరాలకు నీళ్లిద్దామనుకున్నారా? ప్రాజెక్టుకు తొలుత అంచనా వ్యయం రూ.80,190 కోట్లే పెట్టారు కదా? దానిని ఆ తర్వాత (మూడో టీఎంసీని కలుపుకుని) రూ.1.27 లక్షల కోట్లకు ఎందుకు పెంచారు?’’ అని   ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించాలనుకున్నారు కదా.. కానీ, అదనంగా ఓ 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకే రూ.1.27 లక్షల కోట్ల ప్రాజెక్టేంది?’’ అని కమిషన్​ ఫైర్​ అయింది.  అక్కడ నీటిని లిఫ్ట్​ చేయడం తప్ప వేరే మార్గం లేదని, అందుకే ఆ ప్రాజెక్టును చేపట్టారని వెంకటేశ్వర్లు బదులిచ్చారు.

అయితే, ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టుకయ్యే ఖర్చును కాళేశ్వరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు వివరాలను కమిషన్​ ఆయన ముందుంచింది. ‘‘డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే నీటిని లిఫ్ట్​ చేయొచ్చు. 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును ప్రతిపాదించారు. దాంతోపాటు 154 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేసే పవర్​ ప్లాంట్లను నిర్మించాలనుకున్నారు. రెండు లిఫ్టులనూ కట్టాలనుకున్నారు. 29 మీటర్ల ఎత్తుతో లిఫ్ట్​ 1ను కట్టాలన్న ప్రతిపాదన ఉంది కదా. దానికి నీటిని ఎత్తిపోయాలంటే కేవలం 4 మెగావాట్ల విద్యుత్​ సరిపోయేది.

19 మీటర్ల ఎత్తుతో కట్టాలనుకున్న లిఫ్ట్​ 2కు కేవలం 150 మెగావాట్ల కరెంటే ఖర్చయ్యేది కదా. అలాంటప్పుడు 11,230 మెగావాట్ల కరెంట్​ అవసరమయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టాల్సి వచ్చింది?’’ అని కమిషన్​ ప్రశ్నించింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత కేవలం 102 టీఎంసీలుగానే ఉంటుందని సీడబ్ల్యూసీ చెప్పినట్టు వెంకటేశ్వర్లు బదులిచ్చారు.

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదని, 148 మీటర్ల ఎత్తుకు రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం జరిగిందని, ఆ ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే నీటి లభ్యత 44 టీఎంసీలకు పడిపోతుందని చెప్పారు. అందుకే ప్రాజెక్టును మార్చారని వివరించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద అప్పటికే దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చు చేశారని, మరి, ప్రజాధనమంతా వృథా చేసినట్టే కదా అని కమిషన్​ నిలదీసింది. 

తప్పుడు డాక్యుమెంట్లు తెస్తే చర్యలు తప్పవు 

వ్యాప్కోస్​ తయారు చేసిన డీపీఆర్​లలో తొలుత ఫ్లడ్​ బ్యాంక్స్​, డైవర్షన్​ చానెళ్లను ప్రతిపాదించలేదని వెంకటేశ్వర్లు చెప్పారు. దానికి బదులు బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని సూచించిందన్నారు. అయితే, రైతులు తమ భూములను అప్పగించేందుకు ముందుకు రాలేదని, దీంతో ప్లడ్​ బ్యాంకులు, డైవర్షన్​ చానెళ్ల నిర్మాణం కోసం డీపీఆర్​ల​లో మార్పులు చేశామని వివరించారు. ‘‘అసలు డీపీఆర్​లో మార్పులు చేయడానికి మీకు అధికారం ఎక్కడిది?” అని ఈఎన్​సీని కమిషన్​ నిలదీసింది.

మార్పులు చేయాల్సింది వ్యాప్కోస్​ సంస్థ కదా? అని ప్రశ్నించింది. అయితే.. హెచ్​పీసీ, స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత.. ఆ ప్రతిపాదనలను నాటి ప్రభుత్వానికి వివరించామని, తర్వాత కేబినెట్​లో చర్చించారని పేర్కొన్నారు. దీంతో ఆ మీటింగ్​కు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని కమిషన్​ ఆదేశించింది. తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొస్తే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.  

మేడిగడ్డను కోల్​ బెడ్​పై కట్టారా?

మేడిగడ్డను నిర్మించిన స్థలంలో కోల్​ బెడ్​ ఉందా? అని రిటైర్డ్​ ఈఎన్​సీ వెంకటేశ్వర్లును కమిషన్​ ప్రశ్నించింది. కోల్​ బెడ్​ ఉందని తెలిసినా అక్కడే బ్యారేజీని ఎందుకు నిర్మించారని నిలదీసింది. సార్దీప్​ కన్సల్టింగ్​ ఇంజనీరింగ్​ కంపెనీ, జాదవ్​పూర్​ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన ఇన్వెస్టిగేషన్లలో మేడిగడ్డ బ్యారేజీ కట్టిన స్థలంలో కోల్​ బెడ్​ ఉందంటూ నిర్ధారణ అయిందని కమిషన్​ చెప్పగా.. అందులో వాస్తవం లేదని వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ సమయంలోనే సార్దీప్​ సంస్థ రిపోర్ట్​ను వెంకటేశ్వర్లుకు కమిషన్​ చూపించింది. ఇది అబద్ధమా? అంటూ మండిపడింది.

కోల్​బెడ్​పై కట్టడం, కటాఫ్​ వాల్స్​, ఫౌండేషన్​లో లోపాలే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమా అని నిలదీసింది. మేడిగడ్డలో 2019 అక్టోబర్​ 10న తొలిసారి ప్రమాదం జరిగినప్పుడు కూడా.. అందులో నీటిని నిల్వ చేయాలని ఎవరు చెప్పారంటూ కమిషన్​ ప్రశ్నించగా.. నాటి ప్రభుత్వ పెద్దలే చెప్పారని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు.