- కాఫర్ డ్యాం నీటమునగడంతో ఎత్తు పెంచాం
- డిజైన్ల మార్పుతో అంచనా వ్యయం పెరిగింది
- కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు
- మాటలకు, అఫిడవిట్ కు పొంతనలేదని కమిషన్ ఆగ్రహం
హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో 2019 నుంచే సమస్యలు వచ్చాయని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కాళేశ్వరం కమిషన్ కు తెలిపారు. ఇవాళ రెండో రోజు విచారణకు హాజరైన ఆయన పలు కీలక విషయాలను కమిషన్ కు తెలిపారు. మొదట నిర్మించిన కాఫర్ డ్యాం వరదలో మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సి వచ్చిందని చెప్పారు. డిజైన్ల ఖరారులో ఆలస్యం, మార్పుల కారణంగా అంచనా వ్యయం పెరిగిందని కమిషన్‌కు వివరించారు. డిజైన్‌లో మార్పులతో అంచనా వ్యయం అంత భారీగా పెరుగుతుందా? అంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది.
ALSO READ | ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
కాళేశ్వరానికి ముందు ప్రాణహిత - చేవెళ్ల కోసం రూ.14వేల కోట్లకు పైగా విలువైన పనులు చేశారని, అందులో రూ.750 కోట్ల విలువైన పనులు ఫలితం లేకుండా పోయాయని వెంకటేశ్వర్లు తెలిపారు. సవరించిన అంచనా వ్యయాన్ని అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిఆమోదించారని చెప్పారు. మేడిగడ్డ విషయంలో సబ్ స్టాన్షియల్ సర్టిఫికెట్, మిగతా రెండు బ్యారేజీలకు పూర్తి సర్టిఫికెట్ ఇచ్చామని వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక అంశాలు, భూసేకరణ వల్లే బ్యారేజీల పనుల్లో ఆలస్యం అయినట్లు వివరించారు.
అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారానికి, చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని కమిషన్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు బ్యారేజీలకు సంబంధించి స్పష్టంగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, వాటికి ఆధారాలను సోమవారం సమర్పిస్తానని వెంకటేశ్వర్లు తెలుపడంతో కమిషన్ ఆమోదించింది.