
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేత చిదంబరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని, ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అని ఆయన విమర్శించారు. బడ్జెట్లో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, గత బడ్జెట్లో ఇచ్చిన చాలా కార్యక్రమాలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. బీహార్ ఎన్నికలను ఉద్దేశించే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్పై ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. బులెట్ గాయానికి బ్యాండేజ్ వేసినట్టుగా కేంద్ర బడ్జెట్ ఉందని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించాల్సిన అవసరం ఉందని రాహుల్ చెప్పారు. అలాంటి ఆలోచన చేయడం మానేసి.. దేశం దివాళా తీసే ఐడియాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ALSO READ | రూ.8 లక్షల ఆదాయానికి ఇకపై రూ.30 వేల ట్యాక్స్ కట్టక్కర్లేదు: మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనిపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్పై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు.
కేంద్రం పట్టించుకోని తెలంగాణ ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో పెద్దపీఠ వేశారని.. మిగిలిన రాష్ట్రాలను బడ్జెట్లో పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలతో చర్చించి.. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.