కేసీఆర్‌, కేటీఆర్‌.. పెడబొబ్బలు ఆపండి

కేసీఆర్‌, కేటీఆర్‌.. పెడబొబ్బలు ఆపండి
  • ‌‌మా ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలే అయింది‌‌
  • రైతులు, ప్రజలను తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నరు
  • ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, వెలుగు : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలే అయింది.. అప్పుడే ఏదో అయిపోయిట్లుగా కేసీఆర్‌, కేటీఆర్‌ పెడబొబ్బలు పెడుతున్నారు.. మేము ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం.. హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో చేసిన లక్షల కోట్ల అప్పులకు వేల కోట్లలో వడ్డీలు కడుతున్నాం’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గురువారం వనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో లేకపోవడంతో గాబరా పడుతూ రైతులు, ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రాన్ని నాశనం చేశారని, అభివృద్ధిని విస్మరించారన్నారు. దీపావళి పండుగ నాటికి రూ.2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు ఎంతో తేడా ఉందని ప్రజలే చెబుతున్నారన్నారు.

 ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాల్వలు కబ్జా కాకుండా చూస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ లీడర్లు వనపర్తి జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కో శాఖను సరి చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిని విమర్శించే అర్హత మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి లేదన్నారు. వనపర్తిలో కబ్జాలు, అభివృద్ధి విషయంలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌక్‌లో చర్చ పెడదామా అని ప్రశ్నించారు.

స్టూడెంట్లకు విద్యతో పాటు ఆటలపై అవగాహన పెంచాలి

నైతిక విలువలు, సంస్కృతి అలవడేందుకు లైబ్రరీలు ఎంతో ఉపయోగపడుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన లంకల గోవర్ధన్‌ సాగర్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ నాణ్యత, విలువలతో కూడిన బోధన లేకపోవడం వల్లే స్టూడెంట్లు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. 

స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వడంతో పాటు ఆటల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండలంలో లైబ్రరీలను ప్రారంభిస్తామని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి లైబ్రరీలో తెలుగు, ఇంగ్లీష్‌ పేపర్లతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ విష్ణు వర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఫిషరీస్‌ ఆఫీసర్‌ లక్ష్మప్ప పాల్గొన్నారు.