పిడుగుపాటు బాధిత కుటుంబాలకు అందని ఎక్స్ గ్రేషియా

2021, సెప్టెంబర్ 3 న కౌటల మండలం ముత్తంపేట్ గ్రామానికి చెందిన బోర్కుట్ పున్నయ్య అతని భర్య రషిక, కొడుకు బాలాజీ లతో కలిసి కనికి శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటకు పిచికారీ చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన డోంగ్రి హోక్టు అతని భార్య పద్మ, కూతురు శ్వేతతో కలిసి పత్తి పంటకు మందు వేయడానికి వెళ్లారు. సాయంత్రం కావడంతో మబ్బులు కమ్ముకున్నాయని ఇంటికి జల్దీన వెళ్లాలని బయలుదేరారు. 

బోర్కుట్ పున్నయ్య, డోంగ్రి హోక్టు ల పంట పొలాలు పక్క పక్కనే ఉండటంతో డోంగ్రి హోక్టు మిగిలిన మందు వేసి కాస్త ఆలస్యంగా వస్తానని, పున్నయ్య ఎడ్లబండిలో ఇంటికి వెళ్లాలని తన భార్య పద్మ, కూతురు శ్వేతతో చెప్పారు. ఎడ్ల బండిలో బోర్కుట్ పున్నయ్య, అతని భార్య రషిక, కొడుకు బాలాజీ తో పాటు డోంగ్రి పద్మ , శ్వేత ఇంటికి బయలుదేరారు. పంట చేను దాటే లోపే భారీ వర్షం మొదలైంది. వర్షంలోనే ఇంటికి వస్తుండగా ఒక్కసారిగాఎడ్ల బండిపై పిడుగు పడింది.  ఘటనలో బోర్కుట్ పున్నయ్య, డోంగ్రి పద్మ, డోంగ్రి శ్వేత మృతి చెందారు. పున్నయ్యకు చెందిన ఒక ఎద్దు కూడా అక్కడే చనిపోయింది. 

ఆసిఫాబాద్, వెలుగు: పిడుగు పాటుతో మరణించిన వారి కుటుంబాలకు ఏళ్లుగా పరిహారం అందడం లేదు. ప్రమాదాలు జరిగి ఏళ్లు అవుతున్నా.. సర్కార్​నోట పరిహారం ముచ్చట రావడం లేదు. దీంతో ఎక్స్ గ్రేషియా వస్తదా? రాదా? అని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రెండేళ్ల లో 28 ఘటనలు..


పిడుగుపాటుకు ప్రభావితమయ్యే ప్రాంతాల్లో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కూడా ఒకటి. 2021, 2022 సంవత్సరాల్లో జిల్లాలో 28 మంది పిడుగుపాటుతో మరణించారు.  జిల్లాలో వానాకాలంతో పాటు మిగిలిన కాలాల్లోనూ ఉరుములు మెరుపులు వస్తే పిడుగుపాటు సర్వసాధారణం. ఈ క్రమంలో పంట పొలాల్లో, చేన్లలో పనిచేస్తుండే రైతులు, కూలీలు పిడుగు పాటుతో ప్రాణాలు వదులుతున్నారు. అనుకోని ఈ ఘటనలు నిరుపేద కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.  ఆదుకోవాల్సిన సర్కార్ కనీసం పరిహారం కూడా ఇవ్వడం లేదు.

ప్రపోజల్స్ కే పరిమితం..

పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు ఆదుకుంటామని.. వారికి పరిహారం ఇప్పిస్తామని  చెప్పడం.. తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం ప్రజా ప్రతినిధులకు రొటీన్​గా మారింది. ప్రకృతి కన్నెర్ర తో సంభవించే పిడుగుపాటు కు నేచురల్ కెలామిటీ కింద ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.  పిడుగు ప్రమాదం జరిగిన తర్వాత పోలీసుల ఎఫ్ఐఆర్, మెడికల్ సర్టిఫికేట్ జతచేసి పరిహారం కోసం జిల్లా కలెక్టర్ కు తహశీల్దార్లు ప్రపోజల్స్ పంపిస్తారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించి ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తారు. గతంలో ఈ పరిహారం మూడు లక్షలు ఉండేది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలకు పెంచింది. అయితే పెంచిన తర్వాత పరిహారం ఇవ్వడంలో మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రెండేళ్లలో 28 మంది పిడుగుపాటుతో మరణించారు. అయితే వీళ్లకు అందాల్సిన పరిహారం ఫైల్​ఇప్పటికీ కలెక్టర్ వద్దే పెండింగ్ లో ఉంది. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలు కనీసం సర్కార్ ఇచ్చే పరిహారంతో ఆర్థిక భరోసా లభిస్తోందని భావించినా అది అందని ద్రాక్షలాగే మిగులుతుంది.

పైసలు రాలే

మా ఆయన 2021 జూలై 7 తారీకున పత్తి చేన్ల పని చేసుకోంగ పిడుగు పడి చనిపోయిండు. నాకు ఇద్దరు కొడుకులున్నారు. రెండేండ్లు దగ్గరికొస్తున్నా సర్కారు రూపాయి ఇయ్యలేదు. ఇద్దరు పిల్లలతో కూలీకి పోయి బతుకుతున్నా.. శానా గోసైతుంది. ఆ పైసలు ఇప్పిస్తే ఖర్చులకు అక్కరకు వస్తయి.
- బోర్కుటే కౌసల్య, వంకులం