కేసీఆర్ ది పేదల వ్యతిరేక ప్రభుత్వం: ఆకునూరి మురళి

కరీంనగర్ జిల్లాలో నిర్మించిన 1600 డబుల్ బెడ్ రూంలు మూడు సంవత్సరాలు దాటినా పేదలకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆకునూరి మురళి ఆధ్వర్యంలో మహిళలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహిళలు గత రెండు సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కొట్లాడుతున్నారని.. అందుకే వాళ్లకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరఫున తాను వచ్చానన్నారు. 1600 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లక్షల మంది పేదలు నిరీక్షిస్తున్నారని తెలిపారు.  నెలకు రూ. 3 వేలు, 4 వేలు ఇంటికి కిరాయి చెల్లిస్తూ ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన ఇల్లు ఇచ్చి ఉంటే ఇప్పటివరకు ఈ పేదలకు లక్ష రూపాయల మిగిలేటివని అన్నారు.

పేదలకు ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఎమ్మెల్యేల మనుషులు, కార్పొరేటర్లు రెండు, మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆకునూరి మురళి ఆరోపించారు. ఇక్కడే కాదు..33 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలనను తాము ఖండిస్తున్నామని తెలిపారు. వారం రోజుల్లోగా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే కేసీఆర్ కు మూడినట్టేనని అన్నారు. కేసీఆర్ ది పేదల వ్యతిరేక ప్రభుత్వం దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇక ధర్నా అనంతరం ఆకునూరి మురళి కలెక్టర్ వినతిపత్రం అందించారు.