కర్నాటక మాజీ డీజీపీ కేసు: సోదరి పేరిట ఆస్తి రాసిండని లొల్లి.. కారం చల్లి, కత్తులతో పొడిచి హత్య

కర్నాటక మాజీ డీజీపీ కేసు: సోదరి పేరిట ఆస్తి రాసిండని లొల్లి.. కారం చల్లి, కత్తులతో పొడిచి హత్య

బెంగళూరు: కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆస్తి గురించి మొదలైన గొడవలో ఆయన భార్యే ఓం ప్రకాశ్‌‌ను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవకాగా ఓంప్రకాశ్‌‌ కళ్లలో భార్య పల్లవి కారం చల్లి, ఆయనను తాళ్లతో కట్టేసి, కత్తులతో పొడిచి చంపేసింది. అనంతరం తన స్నేహితురాలైన రిటైర్డ్ పోలీస్‌‌ ఆఫీసర్ భార్యకు ఫోన్‌‌ చేసి జరిగినదంతా వివరించింది. ఆ స్నేహితురాలు భర్త పోలీసులకు ఇన్ఫామ్ చేశారు.

సోదరి పేరిట ఆస్తి రాసిండని లొల్లి..
ఓం ప్రకాశ్ మర్డర్ జరిగిన టైంలో ఇంట్లో ఉన్న ఆయన భార్య పల్లవితోపాటు కూతురు కృతిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు. సోమవారం 12 గంటలపాటు విచారణ తర్వాత మర్డర్‌‌‌‌కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. 1981 బ్యాచ్‌‌కు చెందిన ఐపీఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ ఓం ప్రకాశ్‌‌ 2015లో కర్నాటక డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు.

కొడుకు, కూతురు, భార్యతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్న ఓం ప్రకాశ్‌‌ కొద్దిరోజుల కింద కొంత ఆస్తిని తన సోదరికి బదిలీ చేయడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయంపై ఆదివారం భార్యాభర్తలకు వాగ్వాదం మొదలై, చంపుకునేదాకా వెళ్లింది. ఆయన భోజనం చేస్తున్న టైంలో కళ్లలో కారం కొట్టి, ఆయిల్ పోసి, తాళ్లతో కట్టేశారు. ఆపై కడుపు, ఛాతీలో 12 సార్లు కత్తులతో పొడిచి చంపేశారు. ఇందుకు రెండు కత్తులతో పాటు, ఓ పదునైన గాజు సీసాను కూడా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

ఓం ప్రకాశ్ కొడుకు ఫిర్యాదుతో కేసు.. 
ఓం ప్రకాశ్ కొడుకు కార్తికేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి విషయంలో తల్లిదండ్రుల మధ్య గొడవలవుతున్నాయని కార్తికేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి హత్యలో చెల్లి, తల్లి ప్రమేయం ఉందని తెలిపారు. ‘‘నాన్నను చంపేస్తానని వారం రోజులుగా మా అమ్మే బెదిరించింది. దీంతో నాన్న ఆయన సోదరి ఇంటికి వెళ్లిపోయారు. రెండ్రోజుల కింద చెల్లెలు నాన్న దగ్గరికి వెళ్లి ఒత్తిడి చేయడంతో ఆయన ఇంటికి వచ్చేశారు. ఆ మరుసటిరోజే ఈ ఘోరం జరిగింది” అని కార్తికేష్‌‌ వివరించారు.