![బీఆర్ఎస్ కు మాజీ మేయర్ రవీందర్ షాక్](https://static.v6velugu.com/uploads/2025/02/ex-mayor-suneel-rao-shock--brs_X3NjgodM6L.jpg)
- ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా సర్దార్ రవీందర్ సింగ్ పోటీ
- కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్ రాకపోగా బీఎస్పీ నుంచి బరిలో ప్రసన్న హరికృష్ణ
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మాజీ మేయర్ సునీల్ రావు బీఆర్‌ఎస్ ను వీడి బీజేపీలో చేరి నెల రోజులు గడవకముందే మరో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీకి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి చివరి రోజు సోమవారం నామినేషన్ వేశారు.
ఒకేసారి రెండు రాజకీయ పార్టీల్లో కొనసాగడం కుదరనందున ఆయన బీఆర్ఎస్ ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై రవీందర్ సింగ్ ను వివరణ కోరగా.. చివరి నిమిషం వరకు పార్టీ బీఫాం కోసం ఎదురుచూశానని, కానీ ఇవ్వకపోవడం తోనే తప్పని పరిస్థితుల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తమ పేర్లు బ్యాలెట్ పేపర్ లో కిందికి వెళ్లే పరిస్థితి ఉండడంతో కొందరు అభ్యర్థులు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ
తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి టికెట్ ను ఆశించిన మాజీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ ప్రసన్న హరికృష్ణ చివరకు బీఎస్పీ తరఫున నామినేషన్ వేశారు. మొదటి మూడు సెట్లు ఇండిపెండెంట్ గా దాఖలు చేసినప్పటికీ చివరి రోజున బీఎస్పీ తరఫున నామినేషన్ అందజేశారు. సర్టిఫికెట్ ప్రకారం తన పేరు పులి హరికృష్ణ అని ఉండగా.. తన పేరును ప్రసన్న హరికృష్ణగా మార్చుకుని జనవరి 31న గెజిట్ విడుదల చేశారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ నుంచి డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు.
గతంలోనూ బీఆర్ఎస్ రెబల్ గా పోటీ..
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రవీందర్ సింగ్ రెబల్ గా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా భానుప్రసాద్ రావు, ఎల్. రమణకు పార్టీ అధినేత కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో అప్పటికే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా ఉన్న రవీందర్ సింగ్ రెబల్ గా బరిలో నిలిచారు. ఆయనకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.