విజయనగరం జిల్లాలో మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేత ఘటనలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.జిల్లాలో కొత్త సంస్కృతికి ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే ఏం లాభమని, ఈ చర్య ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ పాత్ర ఆక్షేపణీయమని అన్నారు. కలెక్టర్ కూడా మానవీయ కోణంలో చూడకపోవడం దురదృష్టమని అన్నారు.
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నది సుస్పష్టమని, అందుకే ఇకనైనా వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. తాను 1985 నుండి రాజకీయాల్లో ఉన్నానని, తన ఇన్నేళ్ల అనుభవంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదని అన్నారు.దేశం కోసం పోరాడిన ఓ మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే, అధికార పక్షం వారికి ఏం లాభిస్తుందని మండి పడ్డారు.
నిజానికి గత ఎన్నికల ఫలితాల నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని గుర్తు చేశారు బొత్స.తమ జిల్లాలో ఈ రకమైన సంప్రదాయం రాకూడదని బలంగా కోరుకున్నామని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు, ఈ తరహా ఫిర్యాదులు వచ్చినా, ఇంత దారుణంగా వ్యవహరించి, ఆస్తులు కూల్చివేయలేదని అన్నారు బొత్స.