ఏపీకి ఏమిచ్చారు..?: కేంద్ర బడ్జెట్‌పై మండిపడ్డ మాజీ మంత్రి బొత్స

ఏపీకి ఏమిచ్చారు..?: కేంద్ర బడ్జెట్‌పై మండిపడ్డ మాజీ మంత్రి బొత్స
  • బీహార్‌కు భారీగా లబ్ధి.. మరి ఏపీకి ఏమిచ్చారని ప్రశ్న
  • టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శలు

2025-25 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం శనివారం(ఫిబ్రవరి 1) ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై మాజీ మంత్రి, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

బీహార్‌‌పై కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో కూటమి సర్కారే ఉన్నా, అందులో టీడీపీకి పదహారు మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని బొత్స అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీనే అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఈ బడ్జెట్‌తో తేలిపోయిందన్నారు. బీహార్‌తో పోలిస్తే.. ఏపీకి బడ్జెట్ లో దక్కిన వాటా శూన్యమని ఆయన చెప్పుకొచ్చారు.

‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ 

బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ అప్పారావు కవిత చదవడం సంతోషకరమని బొత్స చెప్పారు. ఏపీకి చెందిన మహాకవిని సభలో ప్రస్తావించడం బాగానే ఉందని.. కానీ, తెలుగు రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం మరిచిపోయారని విమర్శించారు. బడ్జెట్‌లో అసలు ఏపీ ప్రస్తావనే లేదని బొత్స అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న దానిపైనా ఆయన మండిపడ్డారు. ఏపీకి జీవనాడిగా చెప్పుకొనే పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తుంటే,  కేంద్రం దానిని 41 మీటర్లకు కుదిస్తూ నిధుల కేటాయింపునకు అంగీకరించడం సరైనది కాదని బొత్స తెలిపారు. ఈ విషయాన్ని కూడా కొంతమంది నేతలు ఘనంగా చెప్పుకోవడం వింటుంటే చాలా బాధ అనిపించిందని చెప్ప్పుకొచ్చారు.

ALSO READ | వైఎస్ జగన్‌ సంచలన నిర్ణయం.. తెరచాటు రాజకీయాలు చేస్తే అనర్హత వేటు