- కేసీఆర్ ఓ మర్రి చెట్టు.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్, వెలుగు : ‘కేసీఆర్ ఓ మర్రి చెట్టు, రేవంత్‌రెడ్డి.. నువ్వో గంజాయి మొక్క... నిన్ను కాంగ్రెసోళ్లే పీకి అవతల పడేస్తారు’ అని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. హనుమకొండలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. కాలం కలిసి వచ్చి రేవంత్‌రెడ్డి సీఎం ఇయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎవరిని మొలవనివ్వవో చూస్తామన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ.. రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి రానివ్వడం లేదని.. ఆయనకు అపాయిమెంట్ కూడా ఇవ్వట్లేదని, అలాంటి రేవంత్ జిల్లాకు వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను ఏడు సార్లు గెలిస్తే.. రేవంత్‌రెడ్డి గెలిచిన చోట మళ్లీ గెలవలేదన్నారు. విజయోత్సవాల పేరుతో జరిగిన సభకు మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డే రాలేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉన్న అందరూ పదవులకు రాజీనామా చేస్తే.. రేవంత్‌రెడ్డి ఒక్కడే రాజీనామా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మహిళలు కాకుండా రేవంత్‌రెడ్డి బంధువులే కోటీశ్వరులు అవుతున్నారన్నారు. కాంట్రాక్టర్ ఆలస్యం కారణంగానే కాళోజీ కళాక్షేత్రం పనులు కాలేదని.. అసలు కాళోజీకి రేవంత్‍రెడ్డితో పరిచయం ఉందా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ నగరంలోని టెక్ మహీంద్ర వంటి కంపెనీలు వాపస్ పోయాయన్నారు. సమావేశంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్
పాల్గొన్నారు.