కొనుగోళ్లు ఆలస్యంతో రైతులకు నష్టం: మాజీ మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట(నంగునూరు), వెలుగు: రైతు రుణమాఫీతో పాటు వడ్ల కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్  ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూర్  మండలం సిద్దన్నపేట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం , రైస్  మిల్లులతో టై అప్​ ఆలస్యం కావడం, డబ్బులు ఆలస్యంగా ఇవ్వడం వంటి కారణాలతో వానాకాలం సీజన్ లో సగం రైతులు వడ్లను దళారులకు అమ్మి నష్టపోయారని పేర్కొన్నారు. రూ. 500 బోనస్  బోగస్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అడగట్లేదని, మద్యం అమ్మకాలు చేయకపోతే ఎక్సైజ్  సూపరింటెండెంట్, సీఐలను ట్రాన్స్ ఫర్  చేశాడని ఆరోపించారు. మద్యం అమ్మకాలు చేయకపోతే చర్యలు తీసుకుంటున్న సీఎం, వడ్లు కొనుగోలు చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చి 11 నెలలైనా రుణమాఫీ పూర్తిగా చేయకుండా,  మహారాష్ట్రకు వెళ్లి తెలంగాణలో రైతులకు రూ.500 బోనస్  ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక భూముల విలువ తగ్గిపోయి  రియల్  ఎస్టేట్  మొత్తం పడిపోవడంతో భూములు కొనే దిక్కులేకుండా 
పోయిందన్నారు.