
ఎంతటి నాయకులైనా అమ్మ ప్రేమకు దాసోహం కాల్సిందే. అమ్మ కష్టాన్ని చూస్తే కరిగిపోవాల్సిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఓ తల్లి కష్టాన్ని గురించి విని కంటతడి పెట్టుకున్నారు. తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని, అమ్మ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చదివిస్తోందని చెప్పిన ఓ చిన్నారి మాటలకు చలించి పోయారు. కంటతడి పెడుతూ చిన్నారిని ఓదార్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ ఘటన చూస్తున్న అందరి కళ్లల్లో నీళ్ళు కమ్ముకున్నాయి.
సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్ లో ‘‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్ లో ఎదగాలి’’ అనే స్కూల్ విద్యార్థుల అవగాహన సదస్సు లో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని చెప్పిన మాటలకు కరిగిపోయారు. తన తండ్రి లేకపోవటంతో తల్లి పడుతున్న కష్టాల గురించి చెప్తూ ఏడుస్తున్న చిన్నారిని చూసి ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఏడవద్దని, ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని ఓదార్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు.
ఈ సందర్భంగా విద్యా్ర్థులకు పలు సూచనలు చేశారు. పిల్లలు వీడియో గేమ్ ల కన్నా ఆటలు మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని అన్నారు. జంక్ ఫుడ్ కన్నా ఇంటిలో తల్లి ప్రేమతో చేసిన వంట తినడం వల్ల ఆరోగ్యం గా ఉంటారని సూచించారు. పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు కానీ చదవడం లేదని, మాతృభాషను మరచిపోకుండా ఉండాలంటే తెలుగు ను రోజూ చదువు కోవాలని సూచించారు.
‘‘సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్ చేయండి , సెలవుల్లో 45 రోజులు జాగ్రత్తగా ఉండాలి, తీర్థ యాత్రలకి వెళ్ళాలి, మీ తల్లిదండ్రులకు వాళ్ళ పనులలో సహాయం చేయండి. మీరు ఉన్నత చదువులు చదివి సెట్ అయ్యాక కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని, చదువు చెప్పిన ఉపాద్యాయులను మరవద్దు’’అని ఈ సందర్భంగా సూచించారు. పిల్లలకు స్టేజ్ ఫియర్ పోవాలంటే ప్రతి రోజూ అద్దం ముందు నిలబడి మాట్లాడటం నేర్చుకోవాలని, అప్పుడే భయం పోతుందని సూచించారు.