పత్తి విత్తనాల కృత్రిమ కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర

  • బ్లాక్ దందాలోనూ ఓ మంత్రి హస్తం  
  • ఆధారాలు బయటపెడతా 
  • మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : పత్తి విత్తనాల కృత్రిమ కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలోని జడ్పీ హైస్కూల్​లో విద్యార్థులకు నోట్ బుక్స్, దుస్తులు అందజేసిన ఆయన తర్వాత క్యాంపు ఆఫీసులో మాట్లాడారు.  పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి హస్తం ఉందని, ఆధారాలు రాగానే అన్ని విషయాలు బయటపెడతానన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసినా ప్రజలకిచ్చిన హామీల అమలు మరిచి విచారణ కమీషన్ల పేరుతో మీడియాకు లీకులిచ్చి కాంగ్రెస్ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తోందన్నారు. ప్రజలు తాగునీటి కోసం రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందని, నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.