- ఆడలేక మద్దెలోడు తరహాలో ప్రభుత్వ పథకాల్లో కోత
- అర్హులందిరీ రైతు రుణమాఫీ అమలు చేయాలి
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రుణమాఫీ అమలుపై పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పనితీరు పేరు గొప్ప.. ఊరు దిబ్బఅన్నట్లు.. మీడియా ప్రచారం, వార్తల లీకేజీలు, ప్యాకేజీలు అన్నట్లు పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ఆడలేక మద్దెలోడు తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లో కోతలు విధిస్తుందని ఫైర్అయ్యారు.
‘రైతులకు సాయంపై రంధ్రాన్వేషణ చేస్తారా! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 70 లక్షల పైచిలు కు రైతాంగంలో సగానికి సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. మరి ఎన్నికల ప్రచార సమయంలోనే రైతుబంధు, రైతుభరోసా పథకాల అమలుకు నిబంధనలు వర్తింప చేస్తామని ఎందుకు చెప్పలేదు ? అధికారం చేతికి వచ్చాక రైతుబంధు మాదిరిగానే గత యాసంగిలో ఎకరాకు రూ.5 వేలు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ, రైతుభరోసా అందరికీ అమలు చేయాలి. ఏ మాత్రం వెనక్కి తగ్గినా రైతులను కలుపుకుని ఉద్యమిస్తం’ అని హెచ్చరించారు.