కోరుట్ల,వెలుగు: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ర్టాల అధికారాలను గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించాలని చూస్తోందన్నారు.
బుధవారం కోరుట్లలోని సి.ప్రభాకర్భవన్లో సీపీఐ జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని, దేశ సంపదను అదానీ, అంబానీ సంస్థలకు దోచిపెడుతుందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటు తున్నాయని, నియంత్రించడంలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. అంతకు ముందు పార్టీ జెండాను ఎగుర వేసి, అమరులైన నేతలకు నివాళులర్పించారు. ఈ సమావేశంలో నేతలు విశ్వనాథం, మౌలానా, రాములు, ముక్రం, రాధ తదితరులు పాల్గొన్నారు.