- బకాయిలు చెల్లించాలని నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో చర్యలు
- ట్రాన్స్‌కోకు రూ.2.57 కోట్లు, ఆర్టీసీకి రూ.7.23 కోట్ల బకాయిలు
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి గురువారం ట్రాన్స్‌కో, ఆర్టీసీ ఆఫీసర్స్ షాక్ ఇచ్చారు. జీవన్ రెడ్డి చెందిన షాపింగ్ మాల్ బకాయి పడ్డ మొత్తం చెల్లించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్ కోకు బకాయి పడ్డ రూ.2.5 కోట్లను చెల్లించాలని నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కరంట్ సప్లై కట్ చేశారు. తమకు బకాయి ఉన్న రూ.7.23 కోట్లను మూడు రోజుల్లో చెల్లించకపోతే షాప్స్ సీజ్ చేస్తామని ఆర్టీసీ ఆఫీసర్స్ హెచ్చరించారు. మాల్‌లో ఉన్న ప్రతి షాప్ వద్దకు వెళ్లి మైక్ ద్వారా అనౌన్స్ చేశారు.
2012లో ఆర్మూర్ ఆర్టీసీకి చెందిన స్థలాన్ని జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి.. విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరిట లీజుకు తీసుకున్నారు. తర్వాతి కాలంలో స్థలాన్ని అదే సంస్థకు కేటాయిస్తూ ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. రజితరెడ్డి పలు బ్యాంకుల్లో లోన్ తీసుకుని.. ఆ ల్యాండ్‌లో ఐదు అంతస్థుల విశాలమైన మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. సినిమా హాల్స్, ఇతర సంస్థలకు రెంట్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బకాయిలు రూ.7 కోట్ల 23 లక్షల71 వేల 807కు చేరుకున్నాయి. ట్రాన్స్‌కో బకాయిలు రూ.2 కోట్ల 57 లక్షల 20 వేల 2కు పెరిగాయి.
బకాయిల రికవరీకి ప్రత్యేక బృందం
ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి, ఆర్మూర్ ఆర్టీసీ ఇన్‌చార్జి డీఎం పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు జీవన్ రెడ్డి మాల్‌కు వెళ్లి మైక్‌లో హెచ్చరిక చేశారు. మూడు రోజుల్లో బకాయి చెల్లించాలని, లేదంటే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.