
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. సీఎం నివాసంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు తన మద్దతు ఉంటుందని మూడ్రోజుల క్రితం కోనప్ప తెలిపారు.
కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం సీఎంను ఆయన కలిశారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో కూడా కోనప్ప భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోనే తాను కొనసాగుతానని కోనప్ప స్పష్టం చేసినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్లో కోనప్ప వివాదం ముగిసిందని పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.