- నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఆఫీసర్ల నిర్ణయం
- ఇంట్లోని సామగ్రిని ఎన్ఎస్పీ స్టోర్‌రూమ్ కు తరలింపు
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కు కేటాయించిన ఈఈ 19 నెంబర్ క్వార్టర్‌ను మంగళవారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు , పెద్దవూర తహసీల్దార్ పావని సరోజ , ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి , సాగర్ సీఐ భీసన్న , ఎస్సై సంపత్ గౌడ్ , నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ ఈ భిక్షమయ్య ఆధ్వర్యంలో క్వార్టర్లోని వస్తువులను నందికొండ మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఎన్ఎస్పీ స్టోర్ రూమ్ కు తరలించారు. అనంతరం క్వార్టర్గేట్లకు తాళాలు వేసి సీజ్‌చేశారు.
సాగర్ డ్యామ్ ఈఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కోసం క్వార్టర్ ఖాళీ చేసి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే భగత్‌కు పలుమార్లు నోటీసులు అందజేసినా స్పందనలేదన్నారు. దీంతో రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్ల సమక్షంలో క్వార్టర్‌ను ఖాళీ చేయించి , సీల్ వేసినట్లు చెప్పారు. కాగా, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్ఎస్పీ అధికారులు క్వార్టర్‌ను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని మాజీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. దీనికి నిరసనగా క్వార్టర్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే భగత్అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అలీనగర్ వద్ద హాలియా పోలీసులు ఆపి నచ్చజెప్పారు. అనవసరంగా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించవద్దని చెప్పడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.