కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇకపై ఆ పార్టీలో కొనసాగనని ఆదివారం స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ, తనను వైసీపీ అధినాయకత్వం అవమానించిందని అన్నారు.
"పార్టీ కోసం ఎంతో కష్టపడి చేశా. అయినప్పటికీ, నాకు టికెట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని, నన్ను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తి(గొల్లపల్లి సూర్యారావు) టికెట్ ఇచ్చి నన్ను అవమానించారు. ఇష్టం లేకపోయినా కాదనలేక ఎంపీగా పోటీ చేశా. ప్రస్తుతానికి వైసీపీతో తెగదెంపులు చేసుకున్నా. వాళ్లు పార్టీ మీటింగ్‌కు రమ్మని పిలిచినా నేను రానని చెప్పా. త్వరలో మరో పార్టీలో చేరుతా. అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాను.." అని రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు.
తిరిగి జనసేనలోకి..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాద్.. అనంతరం వైసీపీ గూటికి చేరారు. అలా పార్టీ మారే క్రమంలో జనసేన పార్టీ బలపడే పార్టీ కాదని.. ఏదో గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచానంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు మళ్లీ ఆయన అదే పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.