కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేం:  మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కంటతడి

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని చొప్పదండి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.  నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన అన్నారు.  డిసెంబర్ 4వ తేదీ సోమవారం నియోజకవర్గంలోని గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో సుంకె రవిశంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎన్నికల్లో తన  గెలుపుకు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 
 కేసిఆర్ లేని తెలంగాణను ఊహించుకోవడం బాధగా ఉందని ఆయన కంటతడి పెట్టుకున్నారు. 2018లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాలు కరోనా, ఒక సంవత్సరం ఆర్థిక మాంద్యం ఉన్నా అభివృద్ధి చేశానని చెప్పారు.  ఎమ్మెల్యే గా అందరికీ అందుబాటులో ఉన్నానని..  ఇప్పుడు కూడా నియోజకవర్గ  ప్రజలకు, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా  అందుబాటులో ఉంటానని రవిశంకర్అన్నారు.