- మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరింపులు
- నేను మాజీ నక్సలైట్‌ను.. ఖతం చేస్తా..
- తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు వీరేశం బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
నకిరేకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై మరోసారి బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా గ్రూపులలో చక్కర్లు కొడుతుంది. గత ఎన్నికల సమయంలో తమ వద్ద రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. ఆ డబ్బులు ఇవ్వమని అడిగితే.. ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఓ మాజీ సైనికుడి భార్య తెలిపారు.
కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన కొమ్ము కోటేష్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎంపీటీసీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే వీరేశం తన భార్య పేరు మీద ఉన్న ఇంటి పేపర్లను కోటేష్ దగ్గర తనఖా పెట్టి.. మాజీ జడ్పీటీసీ మాద యాదగిరికి రూ. 10 లక్షలు అప్పుగా ఇప్పించాడు. మూడు నెలల్లో మీ డబ్బులు మీకిస్తామని చెప్పిన వీరేశం.. 22 నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో కోటేష్ పలుమార్లు వీరేశం, మాద యాదగిరి దృష్టికి తీసుకొచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటుండడంతో.. కోటేష్ భార్య సంధ్య బుధవారం వీరేశం ఇంటికి వెళ్లి డబ్బులు అడిగింది. అందుకు వీరేశం కోపంతో రెచ్చిపోయి.. ‘మీ డబ్బులు ఇవ్వం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. అసలు మీరేవరు.. మిమ్మల్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. నేను మాజీ నక్సలైట్‌ను. మీ ఆయనకు నా గురించి తెలుసు. ఇబ్బంది పెడితే ఖతం చేస్తా’ అంటూ పళ్లు కొరుకుతూ తొడగొట్టి బెదిరించారని సంధ్య వాపోయింది. మరి మీ ఇంటి పేపర్లు మా దగ్గర ఎందుకున్నాయని ప్రశ్నిస్తే.. మీ ఆయన నా ఇంట్లో దొంగతనం చేశాడని వీరేశం అంటున్నాడని.. పైగా మా మీదే రిటర్న్ కేసు పెడతానని అంటున్నట్లు సంధ్య తెలిపింది. దాంతో ఎమ్మెల్యే బెదిరింపులు భరించలేకనే తన భర్త కోటేష్ ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపింది. ప్రస్తుతం కోటేష్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక మాజీ సైనికుడికే ఇలాంటి అన్యాయం జరిగితే ఎలా అని సంధ్య పోలీసులను ప్రశ్నించారు. తన భర్తకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని సంధ్య వాపోయింది. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ.. సంధ్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వీరేశం, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరిపై కేసు పెట్టింది.
కాగా.. వేముల వీరేశం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పలుమార్లు బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీరేశంపై మరోసారి బెదిరింపుల ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.