- చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ నేతృత్వంలో హస్తం గూటికి..
- అదేబాటలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి
- జడ్పీటీసీలు, మాజీ సర్పంచుల చూపు హస్తం వైపే
మంచిర్యాల, వెలుగు : బీఆర్ఎస్కు చెందిన పలువురు కీలక నేతలు కారు దిగుతున్నరు. ఎప్పటినుంచో పార్టీ మారాలని చూస్తున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నరు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌వెంట నడిచినవారు అక్కడ అణిచివేతలను, అవమానాలను భరిస్తూనే ఇంతకాలం ఓపిక పట్టారు. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అవినీతి, అక్రమాలు ఇటీవల బయటకు వస్తుండడంతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది. దీనికితోడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కు గుడ్‌బై చెప్తున్నరు.
తెగిన 16 ఏండ్ల బంధం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోకల్ బాడీస్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ బీఆర్ఎస్తో ఉన్న 16 ఏండ్ల బంధాన్ని తెంపేసుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఇటీవల పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసి అదే రోజు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా శనివారం చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, వినోద్, పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం గూటికి చేరారు.
పురాణం బీఆర్ఎస్కురిజైన్ చేసిన రోజే కోటపల్లి మండలానికి చెందిన ఆయన అనుచరులు సుమారు 50 మంది కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారంతా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సతీశ్ ఆ పార్టీలో పలు పదవులు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో బీఆర్ఎస్లో చేరి కేసీఆర్అడుగుజాడల్లో నడిచారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో మెంబర్‌గా, 2010 నుంచి ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆయన 2015లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆరేండ్లు ఆ పదవిలో కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీ ఆశించినప్పటికీ అప్పటి చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్అడ్డుపుల్ల వేసినట్టు ఆయన అనుచరులు ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల టికెట్ రేసులో ఉన్నప్పటికీ చివరకు నిరాశే ఎదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పురాణం బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.
అదేబాటలో అరవింద్‌రెడ్డి
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సైతం చాలాకాలంగా బీఆర్ఎస్లో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్లో చేరి కేసీఆర్‌కు బాగా క్లోజ్‌గా మెలిగారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010 బై పోల్స్‌లోనూ గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్రాకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్లో చేరారు.
2023 ఎన్నికల్లో మంచిర్యాల టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అరవింద్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, నియోజకవర్గానికి చెందిన జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గతంలోనే హస్తం గూటికి చేరారు.
ఇప్పుడు పది మందికిపైగా జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో జిల్లాలో కారు పార్టీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.