మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే.. అడవిలో బ్రతుకుతున్నామా అనిపిస్తుందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. ప్రజలు కోరుకున్నట్లు లేదని ఆయన అన్నారు. జితేందర్ రెడ్డి ఈ రోజు జూమ్ ద్వారా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు జిల్లాకు నీళ్లు వస్తాయి అనుకున్నాం. పాలమూరు నీళ్ల కోసం 2014లో లక్ష మందితో ఫౌండేషన్ వేశాం. సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరుపై పెట్టలేదు. సీఎంతో సహా అందరూ.. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చడానికి పూనుకున్నారు. ఇలాగే జరిగితే.. హైదరాబాద్ కు వస్తున్న 17.7 టీఎంసీ నీళ్లు కూడా రాకుండా అవుతాయి. రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారిచేసినా కూడా ఏపీ పట్టించుకోకుండా టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తోంది. మహబూబ్ నగర్- ఖమ్మం ప్రజలకు అన్యాయం జరిగితే మళ్ళీ ఇదే ప్రాంతం నుంచి ఉద్యమాన్ని చేపడుతాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో.. నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే మళ్ళీ ఉద్యమాన్ని చేస్తాం. కేసీఆర్ ఆరేళ్ళ పాలన చూస్తుంటే.. తెలంగాణలో ఉన్నామా? మళ్ళీ పాత ఏపీలో ఉన్నామా అనే అనుమానమోస్తుంది. సీఎం కేసీఆర్ అపెక్స్ కమిటీలో నీటి విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలి. సీఎం కేసీఆర్ రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. ఏపీ అక్రమంగా తీసుకుపోతున్న నీళ్లను తెలంగాణ సర్కార్ అడ్డుకోవాలి. కేసీఆర్ సర్కార్ 220 టీఎంసీ నీళ్లను ఉపయోగించుకోకుండా వృధా చేస్తుంది’ అని ఆయన అన్నారు. కరోనా కట్టడి విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు.
For More News..