ఈటల తప్పు చేసుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం మాజీ మంత్రి ఈటలను శామీర్ పేట్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈటలకు సపోర్ట్ ఇవ్వడం కోసమే వచ్చామని కొండా అన్నారు. ఈ సందర్భంగా కొండా మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఈటలకు అండగా ఉంటామని కొండా తెలిపారు. ఈటలను సస్పెండ్ చేసే ధైర్యం లేదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కక్ష సాధింపుగా ఈటల కుటుంబ సభ్యులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని కొండా అన్నారు. కేసీఆర్ కొట్లాడాల్సింది కరొనాపై అని కొండా అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మేమంతా ఐక్యంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
రాజకీయ విబేధాలు ఉంటే చర్చించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతులు పాటించే అలవాటు కేసీఆర్‌కు లేదని కోదండ రాం అన్నారు. ఎవరైనా తన నీడగా బతకాలన్నదే కేసీఆర్ నైజం అని కోదండ రాం వ్యాఖ్యానించారు.