ఒడిశాలోని బారుహాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు అర్జున్ చరణ్ దాస్ మృతి చెందారు. స్నేహితుడితో కలిసి BRS రైతుల సమావేశానికి భువనేశ్వర్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఖరస్రోటా నది వంతెనపై ఇసుక ట్రక్ అర్జున్ చరణ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాస్ ను జిల్లా ప్రధాన ఆసుపత్రి (డీహెచ్‌హెచ్)కు తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి మొహంతికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని SCB ఆసుపత్రికి తరలించారు.
అర్జున్ చరణ్ దాస్ 1995 నుండి 2000 వరకు జాజ్‌పూర్ జిల్లాలోని బింజర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దాస్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ సహా ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.