పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్లు.. ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష

ఇస్లామాబాద్: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పాకిస్తాన్ కోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. అవినీతి కేసులో ఆయనను నేరస్తుడిగా పేర్కొంటూ పాకిస్తాన్ కోర్టు ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం నాడు తీర్పు వెల్లడించింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఈ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ జైలు శిక్ష అనుభవించడంతో పాటు 1 మిలియన్ పాకిస్తానీ రూపాయల జరిమానా, ఆయన భార్య 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది.

ఆగస్ట్ 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ కస్టడీలోనే ఉన్నారు. ఆయనపై దాదాపు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులోఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ  అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో యాంటీ కరప్షన్ కోర్ట్ జడ్జ్ నసీర్ జావెద్ రాణా శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్పై, ఆయన భార్యపై, మరో ఆరుగురిపై 50 బిలియన్ పాకిస్తానీ రూపాయల అవినీతికి పాల్పడి దేశ సంపదను దోచుకున్నారని పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) డిసెంబర్ 2023లో కేసు నమోదు చేసింది.

2018 నాటి ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. రష్యా, చైనా, అఫ్గానిస్తాన్ విషయంలో స్వతంత్ర విదేశీ విధానాన్ని పాటించడం వల్లే అమెరికా ఆధ్వర్యంలో తన సర్కారును కూల్చేందుకు కుట్ర జరిగిందని ఇమ్రాన్ అప్పట్లో ఆరోపించారు. పదవి నుంచి దిగిపోయాక ఇమ్రాన్పై 200 దాకా కేసులు నమోదయ్యాయి. అవినీతి, హింస, దైవదూషణ, హత్య, టెర్రరిజం వంటి ఆరోపణలతో ఈ కేసులు ఫైల్ అయ్యాయి.