మాజీ సర్పంచ్ హత్య కేసులో .. ఆరుగురికి జీవితఖైదు

మునగాల, వెలుగు : సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెం మాజీ సర్పంచ్  పులిందర్  రెడ్డి హత్య కేసులో ఆరుగురు హంతకులకు జీవితఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. 2014 జనవరి 30న నరసింహులకోట నుంచి కోదాడ వెళ్తున్న పులిందర్  రెడ్డిని ప్రత్యర్థులు కోదాడ బైపాస్ రోడ్డులో వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. మృతుడి భార్య విజయలక్ష్మి, ఆమె బంధువులు చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి దర్యాప్తు అధికారి శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేసి  9 మందిని రిమాండ్ కు పంపించారు. పదేళ్ల పాటు కొనసాగిన ఈ కేసు దర్యాప్తులో భాగంగా 31 మంది సాక్షులు, బాధితులను జిల్లా కోర్టు విచారించింది. 

ALSO READ : కాంగ్రెస్​లోకి బీఆర్ఎస్ సర్పంచులు

నరసింహులగూడెం గ్రామానికి చెందిన షేక్  షబ్బీర్, కొప్పుల లక్ష్మీనారాయణ, షేక్  ఇబ్రహీం, మాతంగి శ్రీను, ధూళిపాల నరేందర్, జలీన్‌‌ను దోషులుగా తేల్చింది. ఈ మేరకు  ప్రిన్సిపల్స్ సెషన్స్ జిల్లా కోర్టు జడ్జి జి.రాజగోపాల్  తీర్పు ఇచ్చారు. అయితే, విచారణ సమయంలో జలీల్  చనిపోయాడు. ఈ కేసును వాదించిన పీపీలు శ్రీవాణి, వెంకటేశ్వర్లు, దర్యాప్తు చేసిన కోదాడ డీఎస్పీ ప్రకాశ్, ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ రాము, కోర్టు డ్యూటీ అధికారి హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణ, లైజన్  ఆఫీసర్ సురేంద్రబాబును ఎస్పీ  అభినందించారు. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో నరసింహులగూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.