కవర్ అడ్డం పెట్టి సెల్ ఫోన్ చోరీ

దొంగలు రోజు రోజుకు తెలివిమీరుతున్నారు. ప్రజల కళ్లుగప్పి చోరీకి పాల్పడుతున్నారు. అందరూ చూస్తుండగానే విలువైన వస్తువులను ఈజీగా..చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణంలో ఓ దొంగ అత్యంత చాకచక్యంగా సెల్ ఫోన్ కొట్టేశాడు. బాధితుడికి కనీసం స్పర్శ లేకుండా సెల్ ఫోన్ను ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 
  
సరదాగా కుటుంబంతో కలిసి భోజనం చేద్దామని వచ్చిన మాజీ సర్పంచ్ నే చోరీగాడు బురిడీ కొట్టించాడు. కళ్లు గప్పి కన్నం వేసిపోయాడు. కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ కు  వీణవంక మండలం దేశాయి పల్లికి చెందిన లక్ష్మణ్ అనే మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులతో భోజనం చేసేందుకు వచ్చాడు. కౌంటర్ వద్ద టోకెన్ తీసుకుంటుండగా పాలిథిన్ కవర్ అడ్డుపెట్టి జేబులో నుంచి దొంగ ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు వెళ్లిపోయాడు.