బిల్లులు చెల్లించకుంటే నిరాహార దీక్ష

  •  సర్పంచుల సంఘం డిమాండ్

హైదరాబాద్, వెలుగు : సర్పంచుల పెండింగ్​ బిల్లులు ఈ నెల 30లోగా చెల్లించాలని, లేకపోతే వచ్చే నెల లో ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తామని  సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రణిల్ చందర్​ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్  సోమాజిగూ డ ప్రెస్ క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ సూచన మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక సర్పంచులు అప్పుల పాలయ్యారని, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్  బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్​  చేశారు. అలాగే, గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలలో మాజీ సర్పంచులకు స్థానం కల్పించాలని వారు డిమాండ్​ చేశారు.