మాజీ సైనికుల సంక్షేమం పట్టదా? : బందెల సురేందర్​ రెడ్డి

మాజీ సైనికుల సంక్షేమం పట్టదా? : బందెల సురేందర్​ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2017 జనవరి 17న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ మాజీ సైనికులకు కొన్ని వరాలు ప్రకటించారు. ‘భారతదేశ భౌగోళిక సమగ్రతను సార్వభౌమాధికారాన్ని రక్తం గడ్డకట్టించే చలిలో అయినా, దేహాన్ని దహించే ఎడారి ఉష్ణోగ్రతల్లోనైనా, ఆక్సిజన్ సరిగా ఉండని శిఖరాగ్రాల మీదనైనా.. ఎన్నో కష్టాలు భరిస్తూ ఎంతో సాహసంతో సరిహద్దుల్లో సైనికులు కాపు కాస్తున్నారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ జీవితంలో ఎక్కువ భాగం దేశ రక్షణలోనే నిమగ్నం అవుతున్నారు. ఒక్క సరిహద్దులోనే కాకుండా దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా సైనికులు రంగంలోకి దిగుతున్నారు. వారు తమ ప్రాణం కన్నా కుటుంబ సంక్షేమం కన్నా దేశ రక్షణ మొదటి కర్తవ్యంగా భావిస్తారు. అటువంటి వారి క్షేమాన్ని వారి కుటుంబ క్షేమాన్ని సమాజం ప్రభుత్వం తమ బాధ్యతగా భావించాలి”అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మాజీ సైనికుల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తుందని, అందుకోసం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర ఉద్యోగులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటిస్తారని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత మాజీ సైనికులు రాష్ట్రంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ పొందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పరమవీరచక్ర, మహావీరచక్ర, వీరచక్ర, అశోకచక్ర, కీర్తిచక్ర, శౌర్యచక్ర సేవామెడల్ పొందిన వారికి ఇచ్చే ఆర్థిక సాయం పెంచుతున్నామన్నారు. పది జిల్లాల తెలంగాణలో ఉన్న సైనిక బోర్డులను పెంచి 33 జిల్లాలలో ఏర్పాటు చేస్తామని అన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటు, సైనికుల వెహికల్ టాక్స్ తగ్గించడం, ప్రాపర్టీ టాక్స్ మాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో రెండు శాతం కోటా కేటాయింపు, సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు లాంటి ఎన్నో హామీలు సీఎం కేసీఆర్​ తెలంగాణ మాజీ సైనికులకు ఇచ్చారు. 

ధరణితో తప్పని ఇబ్బందులు

ఇన్ని హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్,​ వాటి అమలుకు మాత్రం కృషి చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాజీ సైనికులకు రెండు శాతం ఉన్న రిజర్వేషన్ పెంచలేదు. అసైన్ ల్యాండ్ 2.5 ఎకరాలు, వెట్ ల్యాండ్ లేదా5 ఎకరాల డ్రైలాండ్ లేదా 175 గజాల ప్లాటు విషయంలోనూ గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఆయన ఇచ్చిన వరాలు కేవలం సర్వీసులో ఉంటూ మెడల్స్ పొందిన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయి. కానీ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత మాజీ సైనికులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది జిల్లాలు 33 జిల్లాలు అయ్యాయి. కానీ పది జిల్లాల సైనిక కార్యాలయాలు33 జిల్లాలకు విస్తరించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో మాజీ సైనికులకు కేటాయించినట్లు 5 ఎకరాలు అసైన్డ్ భూమి కేటాయించక పోగా, ఇంతకుముందు కేటాయించిన భూములను ధరణి పోర్టల్ లో ప్రోహిబిటెడ్ లిస్ట్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నదీ ప్రభుత్వం. కొత్తగా ఎవరైనా మాజీ సైనికులు భూమి కోసం అప్లై చేసుకుంటే రాష్ట్రంలో అసైన్డ్  భూముల పరిమాణం తక్కువ ఉన్నందువల్ల కేటాయించలేకపోతున్నామని సమాధానం ఇస్తున్నారు. కానీ ఇదే ప్రభుత్వం ప్రతి జిల్లాలో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములు లేఔట్లు చేసి స్వయాన జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. మాజీ సైనికులు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్​మెంట్లలో తీసుకునే గ్రోసరీ సరుకులు, మద్యం మీద కూడా ఎక్కువ వ్యాట్ విధించి ఆర్థికంగా నడ్డి విరుస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నది.

ప్రభుత్వం స్పందించాలి..

తెలంగాణ రాష్ట్రం వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని కలలుగన్న మాజీ సైనికులకు సంవత్సరాలుగా ప్రభుత్వం మొండి చేయే చూపిస్తున్నది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు.. ఇలా అందరి జీతాలు పెంచింది. కానీ మాజీ సైనికులపై మాత్రం వివక్ష చూపుతున్నది. ధరణి పోర్టల్ ద్వారా లక్షల ఎకరాల అసైన్డ్ భూములు అమ్ముతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల మేర ఆదాయం పొందుతున్నది. కానీ దేశం కోసం పనిచేసిన మాజీ సైనికులకు మాత్రం భూమి కేటాయించడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం గురించి ఆలోచించాలి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎక్స్​సర్వీస్​మెన్ల పరిస్థితి ఏమీ బాగాలేదని పాలకులు గమనించాలి.

- బందెల సురేందర్​ రెడ్డి, మాజీ సైనికుడు