- సొంత రాష్ట్రంలో కేసులు,వేధింపులు ఎదుర్కొంటున్న
- ఇండియాకు వెళ్లలేను..ఆశ్రయమివ్వాలని విజ్ఞప్తి
- రెడ్ కార్నర్ నోటీసులు,పాస్‌పోర్ట్ రద్దుకురాష్ట్ర పోలీసుల యత్నం
- చివరి అస్త్రంగా నేరస్తులఅప్పగింత ఒప్పందంపైనా దృష్టి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరాడు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని విజ్ఞప్తి చేశాడు. తన గ్రీన్ కార్డ్, క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన హెల్త్ రిపోర్టులు సహా రాష్ట్రంలో పోలీసులు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలను జత చేస్తూ యూఎస్ రెఫ్యూజీ అడ్మిషన్స్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.
తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తించానని, ప్రభుత్వం మారాక తనపై రాజకీయపరంగా అక్రమ కేసులు నమోదు చేశారని దరఖాస్తులో పేర్కొన్నట్లు తెలిసింది. తన వయస్సు, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా స్వదేశంలో వేధింపులు ఎదుర్కోలేనని పేర్కొన్నట్టు సమాచారం.
రప్పించే మార్గాలపై పోలీసుల ఫోకస్
ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ శాఖ ద్వారా సేకరిస్తున్నారు. ఒకవేళ ప్రభాకర్‌రావు దరఖాస్తుపై అమెరికా నుంచి ఏదైనా ప్రాసెస్ మొదలైతే కేసు తీవ్రత గురించి వెల్లడించేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియను మరింత స్పీడప్చేయాలని భావిస్తున్నారు.
ప్రభాకర్ రావుతోపాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును కూడా ఇండియాకు రప్పించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా సీబీఐని మరోసారి ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావడంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. గ్రీన్‌కార్డు ఉన్నప్పటికీ నిందితులను ఇండియాకు తరలించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
నిందితుల అప్పీల్ ను తిరస్కరించిన కేంద్రం
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ అమలులో ఉంది. దీంతో పాటు పాస్‌పోర్ట్‌లను జప్తు చేశారు. ఈ క్రమంలోనే పాస్‌పోర్టులను రద్దు చేయించేందుకు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. పాస్‌పోర్టులను రద్దు చేయాలని గత నెలలో రీజనల్ పాస్‌పోర్ట్ అథారిటీకి లెటర్ రాశారు. ఈ లెటర్ రీజనల్ పాస్‌పోర్ట్ అథారిటీ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ(ఎమ్‌ఈఏ)కు చేరింది.
ఐతే తమ పాస్‌పోర్టును రద్దు చేయకూడదని ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇప్పటికే విదేశాంగ శాఖకు అప్పీల్ చేసుకున్నారు. వీరి అప్పీల్‌ను ఎమ్‌ఈఏ తిరస్కరించింది. పోలీసుల వినతి మేరకు పాస్‌పోర్టులను క్యాన్సిల్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఓ వైపు రెడ్‌కార్నర్, మరోవైపు పాస్‌పోర్టుల రద్దు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పోలీస్ అధికారులుయత్నిస్తున్నారు.
‘నేరస్తుల అప్పగింత’పై కసరత్తు
రెడ్‌కార్నర్ నోటీసులు ఆలస్యం అవుతుండటం, ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితులిద్దరినీ వీలైనంత త్వరగా రప్పించేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా అమెరికా, ఇండియా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్నీ ప్రయోగించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.
ఇందుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తల ఫోన్ నంబర్స్‌ను ట్యాప్ చేయడంలో శ్రవణ్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో పాటు హైకోర్టులో శ్రవణ్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో శ్రవణ్‌రావును అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ కావడంతో ఇండియాకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుంటామని ఓ అధికారి వెల్లడించారు.