కామారెడ్డి, వెలుగు: జిల్లాలోని కంకర క్వారీల్లో రూల్స్‌కు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. క్వారీల్లో పొలిటికల్ లీడర్ల భాగస్వామ్యం ఉండడం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా సాగుతోంది. క్వారీల్లో రూల్స్ఉల్లంఘనపై ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు పలువురు ఫిర్యాదులు చేశారు. ఇష్టారీతిన తవ్వకాలు, పేలుళ్లతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్వారీల్లో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అధికారుల తనిఖీల్లో పర్మిషన్ తీసుకున్న దాని కంటే ఎక్కువ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు.
జిల్లాలో బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోని కంకర క్వారీలున్నాయి. బండరాయిని తవ్వి, పగులగొట్టి కంకరగా మారుస్తారు. ఇండ్ల నిర్మాణం, రోడ్లు, తదితర నిర్మాణాలకు కంకర వినియోగిస్తారు. తవ్వకాల కోసం మైనింగ్‌శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. క్యూబిక్మీటర్మేర తవ్వేందుకు ప్రభుత్వానికి రూ.175 చెల్లించాలి. నెలకోసారి తవ్వకాలకు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ తీసుకున్న ఏరియాలో నిర్ధేశించిన లోతు కంటే ఎక్కువ తవ్వితే చెల్లించాల్సిన రాయల్టీపై 5 రేట్లు, అసలు పర్మిషన్ లేని ఏరియాల్లో తవ్వకాలు జరిపితే 10 రేట్ల ఫైన్వేస్తారు. ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి కొలతలు తీస్తారు.
రూ.60 లక్షల ఫైన్
మాచారెడ్డి మండలం మంథని దేవునిపల్లి శివారులోని కంకర క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని, సమీప గ్రామాల్లోని పంట పొలాల్లో రాళ్లు పడుతున్నాయని, ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. క్వారీ సమీప గ్రామస్తులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. వీటిపై పరిశీలన చేపట్టాలని మంత్రి సంబంధిత ఆఫీసర్లకు ఆదేశించారు.
దీంతో ఇటీవల మంథనిదేవునిపల్లిలోని కంకర క్వారీని మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. ఇక్కడి క్వారీల్లో జరిపిన తవ్వకాలు, స్టాక్ ఉన్న కంకర మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించారు. స్టాక్ ఉన్న కంకరకుగాను 25 వేల టన్నులకు రాయల్టీ చెల్లించినట్లు లెక్కలు చూపారు. ఇంకా 12 వేల టన్నులకు రాయల్టీ చెల్లించాల్సి ఉందని గుర్తించారు. దీంతో రూ.60 లక్షల ఫైన్ విధించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌కు రిపోర్ట్ అందించారు. గతంలోనూ ఈ క్వారీకి ఫైన్ విధించారు. మిగతా క్వారీల్లో కూడా తనిఖీలు చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
తేడాలు గుర్తించి ఫైన్
మంథని దేవునిపల్లిలో కంకర క్వారీలో ఇటీవల తనిఖీలు నిర్వహించాం. నిల్వ ఉన్న స్టాక్, రాయల్టీ చెల్లింపుల మధ్య తేడా గమనించి ఫైన్ విధించాం. జిల్లాలో అనుమతికి మించి కంకర తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం.
కాంతికుమార్, మైనింగ్ శాఖ ఇన్చార్జ్ ఏడీ, కామారెడ్డి