
మరికల్, వెలుగు: మండలంలోని రాకొండ గ్రామంలోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాకొండకు చెందిన సువర్ణ కొడుకు పెళ్లి ఈ నెల 11న జరిగింది. భార్యతో కలిసి కొడుకు రెండు రోజుల కింద అత్తారింటికి వెళ్లగా, సువర్ణ గ్రామంలోని ఇతరుల ఇంటికి వెళ్లి పడుకుంది.
ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దుండగులు శనివారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి, ఇంట్లో గుంతను తవ్వి మట్టి బయట పోశారు. ఆదివారం ఇంటి పక్కన ఉన్నవారు గమనించి సమాచారం ఇవ్వడంతో, సువర్ణ వచ్చి చూడగా ఇంట్లో గుంత కనిపించింది. అలాగే ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేసి కనిపించాయి. బాధితురాలు గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.