వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో గుప్త నిధుల కలకలం రేగింది. మండలంలోని విశ్వనాధ్ పూర్ గ్రామ శివారులో వెంకట్ రెడ్డి పొలాల్లో ఉన్న పురాతన శివ లింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలిగించారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లిన వెంకట్ రెడ్డి.. భూమిలో పాతుకుని ఉన్న శివలింగాన్ని తొలిగించడాన్ని గమనించి.. గ్రామస్తులకు తెలిపాడు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పురాతన శివలింగం తొలగించన ప్రాంతంలో మద్యం బాటిల్, కళ్ళు బాటిల్ కనిపించడంతో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పురాతన శివలింగాన్ని తొలిగించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గతంలో గూడా యాలాల మండలంలో గుప్త నిధులు దొరకినట్లు తెలిపారు. శివలింగం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గ్రామస్తులు కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.