వరంగల్ బల్దియాకు ఎక్సలెన్స్​ అవార్డు

వరంగల్ బల్దియాకు ఎక్సలెన్స్​ అవార్డు

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: వరంగల్ బల్దియా సిగలో మరో మణిహారం చేరింది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి గృహ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యూఏ) ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో స్మార్ట్ సిటీ నగరాలకు సంబంధించి జరిగిన సమావేశంలో మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ (ఎన్ఎన్ సీ) పోటీల్లో ఇతర నగరాలతో పోటీపడి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి(టాప్)-5 నగరాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అందజేసినట్లు బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర తెలిపారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ మన వరంగల్​నగరానికి రావడం గర్వకారణమని, గతంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీ నగరాలను ఎంపిక చేసింది. అందులో నుంచి ఫేజ్ -1 లో భాగం గా నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ పేరుతో నిధులు అందజేసి, నిర్ణీత సమయంలో పార్కు లను ఏర్పాటు చేయడానికి పోటీలు నిర్వహించిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఎంహెచ్ నగర్​లో చిట్టి పార్క్ 56 గంటల రికార్డ్ స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

దీంతోపాటు క్రిస్టియన్ కాలనీలో నైనర్హుడ్ పార్క్, కరీమాబాద్​గుండు బావి, శ్రీనగర్ కాలనీ సేన్సోరి పార్క్, ఎల్ పీ స్కూల్ లో సైన్స్ పార్క్, అంబేద్కర్ కూడలి వద్ద బుద్ధ ప్లాజాలను నిర్దేశిత సమయంలో ఏర్పాటు చేసి డాక్యుమెంటేషన్​ను ఎంపిక కమిటీకి పంపించామన్నారు. దేశవ్యాప్తంగా 5 నగరాల్లో బల్దియాకు ఎక్సలెన్స్ సర్టిఫికేట్(అవార్డు) ఎంపిక చేసిందని తెలిపారు.